మచిలీపట్నం (చైతన్య రథం): కొన్ని గంటల్లో ఈ`కార్యాలయ దస్త్రాలను పరిష్కరించడంలో నలుగురు జిల్లా కలెక్టర్లు మెరుగైన పనితీరు ప్రదర్శించగా.. అందులో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అగ్రస్థానంలో నిలిచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ముఖ్యమంత్రి గత 3 నెలలుగా జిల్లాలవారీగా ఈ`కార్యాలయ దస్త్రాల పరిష్కారంపై సమీక్షిస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్‌తోపాటు నలుగురు జిల్లా కలెక్టర్లు ఒకరోజుకంటే తక్కువగా కొన్ని గంటల్లోనే ఈ-కార్యాలయ దస్త్రాలను పరిష్కరించారన్నారు. అందులో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. క్షేత్రస్థాయి కార్యాలయాల్లో సిబ్బంది ముఖ్యంగా వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు రీసర్వే కార్యక్రమంలో భాగంగా ఉదయమే గ్రౌండ్ ట్రూతింగ్ కోసం వెళ్తుంటారని.. వారికి విధుల హాజరునుండి మినహాయింపు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్యమంత్రిని కోరారు.
అంతకుముందు క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరుపై సమీక్షిస్తూ 74 శాతం విధులకు హాజరవుతున్నారని, 26శాతం హాజరు వేయడం లేదని, కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న ప్రజాభిప్రాయం ఉందని ఐటిఈ అండ్ సి ఆర్టీజియస్ కార్యదర్శి కాటంనేని భాస్కర్ చెప్పడంతో.. జిల్లా కలెక్టర్ పైవిధంగా స్పందించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి స్పందిస్తూ కార్యాలయానికి రానివారిపట్ల కలెక్టర్లు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, క్షేత్ర పర్యటనకు వెళ్లిన వారికి మినహాయింపునిచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భూగర్భ జలాలపై సీఎం జిల్లాలవారీగా విశ్లేషిస్తూ.. కృష్ణాజిల్లాలో ఈ ఏడాది జూన్ 1నాటికీ 9.45 మీటర్ల లోతులో నీరుంటే ప్రస్తుత నవంబర్ 25నాటికి 7.69 మీటర్ల లోతుకు వచ్చిందన్నారు. పంచాయతీరాజ్ శాఖతో ప్రణాళిక సిద్ధం చేసుకుని వచ్చే వర్షాల తర్వాత పెంపుదల చేయాలని సూచించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ బాపులపాడు, గన్నవరంవంటి నాలుగు మండలాలు అప్‌లాండ్‌లో ఉన్నాయని, అక్కడ 3 నెలల్లో భూగర్భ జలాలు పెంపుదలకు తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి వివరించారు.















