.చంద్రబాబు సహా టిడిపి సీనియర్ నేతల సంతాపం
.నేడు గుంటూరులో అంత్యక్రియలకు యువనేత లోకేష
అమరావతి: గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం కన్నుమూశారు. కొవిడ్ తర్వాత అనారోగ్య సమస్యలతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నుంచి 1983, 1985,1999లో టీడీపీ తరుఫున ఆయన ఎమ్మెల్యేగా పోటి చేసి గెలుపొందారు. ఎన్టీఆర్ మంత్రి మండలిలో మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు హయాంలో ఏపీ ఆహార కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు.
పార్టీకి తీరని లోటు : చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. నిబద్ధతతో, నిజాయితీతో పుష్పరాజ్ చేసిన రాజకీయం నేటి యువతకు ఆదర్శమన్నారు. అధ్యాపక వృత్తిని వదిలి స్వర్గీయ ఎన్‌టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగినట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా అనేక పథకాలకు పుష్పరాజ్ నాంది పలికినట్లు పేర్కొన్నారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలందించారన్నారు. ఏపీ ఫుడ్ కమిషన్ ఛ్కెర్మన్‌గా ప్రజలకు విశేష సేవలందించినట్లు తెలిపారు. కల్తీ ఆహార పదార్థాలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
నిబద్ధత కలిగిన నేత పుష్కరాజ్ : నారా లోకేష్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. నిబద్ధత కలిగిన నేతని కోల్పోవడం బాధాకరమన్నారు. ఏ పదవి చేపట్టినా నిజాయితీతో పని చేసిన పుష్పరాజ్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
యువతరానికి స్ఫూర్తి పుష్పరాజ్ : అచ్చెన్నాయుడు
నిజాయితీకి, నిబద్ధతకు జేఆర్ పుష్పరాజ్ మారుపేరుగా నిలిచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు కొనియాడారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించేవారని తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పుష్పరాజ్ లేని లోటు తీరనది : బాలకృష్ణ
మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ మృతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటని, శాసనసభ్యునిగా,మంత్రిగా, ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా ఆయన సేవలు ప్రశంసనీయమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, హిందూపురం శాసనభ్యులు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, బీసీల సంక్షేమం కోసం పుష్పరాజ్ పరితపించేవారన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుల మంత్రి మండలిల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేశారని తెలిపారు. దళితుల సాధికారత కోసం ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. పుష్పరాజ్ మృతి బడుగు బలహీనవర్గాలకు తీరనిలోటన్నారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
టీడీపీ తెలంగాణ అధ్యక్షులు నర్సింహులు సంతాపం
మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ మృతికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బక్కని నర్సింహులు, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి, అరవింద కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పుష్పరాజ్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని శ్లాఘించారు. పుష్పరాజ్ మృతి తెలుగుదేశం పార్టీకే కాకుండా బడుగు బలహీనవర్గాలకు తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.