- ప్రపంచ ప్రఖ్యాత ఈక్వెనెక్స్ సంస్థకు మంత్రి లోకేష్ ఆహ్వానం
- సంస్థ ప్రతినిధులతో భేటీ
- రాష్ట్రంలో పెట్టుబడులకు వినతి
- అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టీకరణ
శాన్ఫ్రాన్సిస్కో (చైతన్యరథం): ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా శాన్ఫ్రాన్సిస్కోలోని ప్రపంచ ప్రఖ్యాత డేటా సేవల సంస్థ ఈక్వెనెక్స్ డేటా సెంటర్ కేంద్ర కార్యాలయాన్ని మంత్రి లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా తమ కంపెనీ అందిస్తున్న డేటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండీ కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లోకేష్‌కు వివరించారు. ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన, సురక్షితమైన డేటా సేవలను అందిస్తున్న సంస్థగా ఈక్వెనెక్స్‌కు పేరుందని తెలిపారు. తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 260కి పైగా ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్స్చేంజి డేటా సెంటర్ల నెట్ వర్క్ కలిగి ఉందని చెప్పారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను వివరించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీలో పవర్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలతోపాటు మెరుగైన ప్రోత్సాహకాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారని చెప్పారు. భారత్‌లో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొని ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఈక్వెనెక్స్ ముందుకు వస్తే తాము అన్నివిధాలా సహాయ, సహకారాలు అందజేస్తామని చెప్పారు.