- ఐదేళ్లూ.. రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు
- పదవి పోయాక నీతులు వల్లిస్తున్నారు..
- వైసీపీ హింసకు పేర్ని సమాధానమివ్వాలి
- ఇంకా డ్రామాలాడితే.. ప్రజలు క్షమించరు
- గనులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రానికి వైసీపీ శనిలా దాపురించిందని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లు విధ్వంస పాలన సాగించిన వైసీపీ.. ప్రజలిచ్చిన తీర్పుతో అధికారానికి దూరమై ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ నేత పేర్ని నాని కబుర్లు చూస్తుంటే.. వెయ్యి గొడ్లనుతిన్న రాబందు నీతులు చెప్పినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారాన్ని సోమవారం ఒక ప్రకటనలో ఖండిస్తూ.. ఐదేళ్లు దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాల్లో పైశాచికానందం పొందిన వైసీపీ బ్యాచ్ ఇప్పుడు నీతులు చెబుతూ, రాజ్యాంగం గురించి, ప్రజల గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. తోట చంద్రయ్యను నడిరోడ్డుపై పీకకోసి చంపారు. అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాస్కు అడిగిన డా.సుధాకర్‌ను నడిరోడ్డుపై పెడరెక్కలు విరిచికొట్టారు. మద్యం గురించి ప్రశ్నించిన విక్రమ్‌ను అంతమొందించారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న వరప్రసాద్‌కు గుండుకొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఐదేళ్ల వైసీపీ పాలనంతా ప్రజలకు క్షణమొక గండంలా గడిచింది.
న్యాయం చేయమన్న అమరావతి రైతులు, మహిళలపై దాడులు చేశారు. పల్నాడులో ఎన్నికల పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్న, హైకోర్టు లాయర్‌ను చంపబోయారు. దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైకి గంజాయి ముఠాను పంపి దాడి చేశారు. ఐదేళ్లలో దాదాపు 2వేల మంది తెలుగుదేశం పార్టీ నేతల్ని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాకే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నాని ప్రజలు చెబుతుంటే.. వైసీపీ నేతలు భరించలేకపోతున్నారని మంత్రి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో కుట్రతో కూటమి ప్రభుత్వంపై నిందలేస్తూ పైశాచిక ఆనందం పొందడం వైసీపీ నైజంగా అభివర్ణిస్తూ.. తప్పు చేసిన అధికారుల్ని చట్టం ప్రకారమే శిక్షిస్తామని నారా లోకేశ్ ప్రకటించిన నాటినుండి పేర్ని నాని లాంటి అరాచ శక్తుల గుండెల్లో వణుకు మొదలైందన్నారు. అందుకే రెడ్ బుక్ చూసి వణుకుతున్నారని, ఇప్పటికైనా పేర్ని నాని చేసిన తప్పులకు ప్రజల్ని క్షమాపణలు కోరితే మంచిదని హితోక్తి పలికారు. ఇంకా నీతిలేని రాజకీయాలను నమ్ముకుంటే ప్రజలే తిరుగుబాటు చేస్తారని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.