- గత ప్రభుత్వ దోపిడీకి కేబినెట్ చెక్
- దీపావళి నుంచే దీపం సిలిండర్లు..
- 48 గంటల్లో డీబీటీ ద్వారా చెల్లింపులు
- జీవోఐఆర్ పోర్టల్ పునరుద్ధరణకు నిర్ణయం
- పారదర్శకతకు పెద్దపీట వేసిన సర్కారు
- పాలకమండళ్లలో బ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణులకు చోటు
- కేబినెట్ నిర్ణయాలను ప్రకటించిన మంత్రి కొలుసు
అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళినుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరాకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదించింది. సీనరేజ్ చార్జీల రద్దువల్లే ప్రభుత్వంపై రూ.264 కోట్ల భారమని అంచనా వేశారు. అలాగే, ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించేందుకు, సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖకు చెందిన వివాదాస్పద పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి జగన్ ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిన 15 ఎకరాల అత్యంత విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అంటే, శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్ర సచివాలయంలో జరిగిన నాలుగో ఇ-క్యాబినెట్ భేటీలో దాదాపు 15 అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారధి, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, గనుల మంత్రి కొల్లు రవీంద్ర, హోంమంత్రి వంగలపూడి అనిత సంయుక్తంగా వెల్లడిరచారు. తొలుత మంత్రి కొలుసు పార్థ సారధి మాట్లాడుతూ.. సాధారణ పరిపాలనా విభాగానికి సంబంధించి జీవోలను జనరేట్ చేసేందుకు, అప్‌లోడ్ చేసేందుకు జీవోఐఆర్ వెబ్ పోర్టల్ పునరుద్ధరణ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందన్నారు. గత ప్రభుత్వం 2021 సెప్టెంబరు 7న జీవో 100 జారీ చేసి, టాప్ సీక్రెట్, సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, రొటీన్ నేచర్ అంటూ కేటగిరీలుగా జీఓలను విభజించింది. వాటిలోనూ కొన్ని జీవోలనే ఏపీ ఈ-గెజిట్ పోర్టల్‌లో వారానికోసారి అప్‌లోడ్ చేసేది. అయితే కోర్టు అన్ని జీవోలను అప్‌లోడ్ చేయాలని ఆదేశించినా, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. పరిపాలనలో సాంకేతికతను జోడిరచి పారదర్శకతకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో ప్రతి జీవోను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవోఐఆర్ పోర్టల్‌ను పునరుద్ధరించడంతో ప్రజలందరూ స్వేచ్ఛగా జీవోలను చూడొచ్చన్నారు.చట్ట సవరణ ద్వారా దేవాదాయ సంస్థల బోర్డు ట్రస్టీల్లో ఇద్దరు సభ్యులను పెంచడానికి, మతపరమైన సంస్థల ధర్మకర్తల మండలిలో బ్రాహ్మణ మరియు నాయీ బ్రాహ్మణ సంఘాల నుండి ఒక్కొకరిని సభ్యునిగా నామినేట్ చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఆలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందడుగులు వేస్తోందని, ఆలయ ఆదాయం రూ.20 కోట్లుకంటే అధికంగావుంటే 15మంది బోర్డు సభ్యులున్నచోట 17కు పెంచనున్నట్టు చెప్పారు. ఇలా అన్ని ట్రస్ట్ బోర్డుల్లో ఇద్దరు చొప్పున అదనంగా సభ్యుల సంఖ్య పెంచుతూ, ట్రస్ట్ బోర్డులో బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ సామాజిక వ్యక్తి ఉండేలా చూస్తామన్నారు.
టెండర్ల విధానంలో గత ప్రభుత్వం అవలంభించిన జ్యుడీషియల్ ప్రివ్యూతో ఎలాంటి ప్రయోజనం లేదని, దానివల్ల టెండర్ల అక్రమాలకు రిటైర్డ్ జడ్జితో ఆమోద ముద్ర వేయించుకోవటమేనని మంత్రిమండలి అభిప్రాయపడినట్టు చెప్పారు. అందుకే రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ.. కేంద్రంసహా అన్ని రాష్ట్రాలు టెండర్ల విధానంలో అనుసరిస్తోన్న కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) గైడ్‌లైన్స్‌నే అనుసరించాలని నిర్ణయించామన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు నెలకు రూ.6 వేల పింఛను ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి అమలు చేస్తున్నట్టు మంత్రి కొలుసు చెప్పారు. వికలాంగుల కోసం గతంలో అమలు చేసిన ప్రత్యేక పథకాలను గత ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరమంటూనే, కూటమి ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. సమగ్ర మానవాభివృద్ధి ద్వారా సమాజంలో ఉన్నత ప్రమాణాలు ఆవిష్కరించేందుకు ఇలాంటివారికి అండగా నిలవడం ప్రభుత్వాల సామాజిక బాధ్యతగా సవరణ చేయడం జరిగిందన్నారు. టీడీపీ హయాంలో దివ్యాంగుల కోసం అమలు చేసిన పథకాలను గత ప్రభుత్వం రద్దు చేస్తే.. వాటిని పునరుద్ధరిస్తామన్న సీఎం హామీమేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గత ప్రభుత్వం విశాఖపట్నంలోని శారదా పీఠానికి 15 ఎకరాల విలువైన భూమి అప్పనంగా ఇచ్చిందని, దాని వాస్తవ విలువ రూ.225 కోట్లుంటే.. ఎకరాకు లక్ష చొప్పున రూ.15 లక్షలకు ధారాదత్తం చేసిందన్నారు. పీఠానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం భూములను వాడుకోవాలన్న దురుద్దేశం గ్రహించిన ప్రభుత్వం.. భూ కేటాయింపులను రద్దు చేసిందన్నారు. టీటీడిలోనూ పీఠానికి భూములు కేటాయించారని, వాటినీ పీఠం దుర్వినియోగం చేస్తూ వాణిజ్యపంగా ఉపయోగిస్తోందన్నారు.
విశాఖపట్నంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో (27) టీచింగ్ పోస్టులు మరియు (56) నాన్ టీచింగ్ పోస్టులు వెరశి మొత్తం (83) నూతన పోస్టులు మంజూరు చేసేందుకు, వాటిని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రమోషన్/ కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. అలాగే, మంగళగిరిలో ఎయిమ్స్ మాత్రమే కాకుండా రాష్ట్రంలో మరెన్నో ప్రతిష్టాత్మక వైద్య సంస్థలు వచ్చాయంటే అది చంద్రబాబు కృషి ఫలితమే. టీటీడీ ద్వారా రాయలసీమ జిల్లాల ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో 1986లో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) స్థాపించడం జరిగింది. ఉద్దానం సమస్యకు ఊరట కలిగిస్తూ 62 డయాలసిస్ కేంద్రాలను నెలకొల్పి కిడ్నీ రోగులకు ప్రతి నెలా ఫించన్లను అందచేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి లక్ష్యంపై కేబినెట్ చర్చించిందన్నారు.
రైతన్న సంక్షేమమే లక్ష్యంగా.. వ్యవసాయానికి పెద్దపీట వేస్తోంది ఎన్డీయే ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గత ప్రభుత్వం రైతన్నలకు పెట్టిన ధాన్యం బకాయిలను రూ.1,674 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.2.64 లక్షల కోట్ల రుణాలు అందజేయాని లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇందులో రూ.1.66 లక్షల కోట్లు పంట రుణాలే. అలాగే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, విజయవాడ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి ఇప్పటికే పొందిన రూ.80 కోట్ల బ్యాంక్ ఋణానికి ప్రభుత్వ గ్యారెంటీ కొనసాగించడానికి చేసిన ప్రతిపాదనకూ మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా పాల్గొన్నారు.