- మేం పాటిస్తున్నాం.. మీరూ పాటించండి
- ప్రజా సేవకులమన్న స్పృహ వీడొద్దు
- కష్టపడిన వాళ్లకు అన్యాయం జరగదు..
- ఇది మొదటిదే.. చివరి జాబితా కాదు
- ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో పార్టీకి తెలుసు
- మీమీ విభాగాలపై అవగాహన పెంచుకోండి
- పార్టీకి, ప్రభుత్వానికి మంచిపేరు తేవాలి
- కార్పొరేషన్ల కొత్త చైర్మన్లకు చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ `వ్యక్తులైనా, వ్యవస్థలైనా ఈ విధానాన్ని మనసులో పెట్టుకుంటేనే రాణింపుంటుంది. నేను, పవన్ కల్యాణ్ ఇదే చెప్తున్నాం, అంతా పాటించాలి. ప్రభుత్వంలో పదవి అనేదే బాధ్యత మాత్రమే, మనలో ఎక్కడా అహంకారం కనిపించకూడదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నామినేటెడ్ పదవులు పొందినవారికి దిశా నిర్దేశం చేశారు. కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ చైర్మన్లతో బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తూ.. పదవులు పొందిన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎవరు ఏ పదవిలోవున్నా ప్రజా సేవకులనే గుర్తుపెట్టుకోవాలన్నారు. పదవుల్లోవున్నవారి నడవడిక, తీరు ప్రజలు గమనిస్తూనే ఉంటారని, ప్రజలకంటే మనం ప్రత్యేకమన్న భావనకు దూరంగా ప్రతి కదలికా, మాటా, పని గౌరవంగా, హూందాగా ఉండాలన్నారు. కూటమిలో భాగస్వాములైన మూడు పార్టీల వారికీ పదవులిచ్చామని, మొన్నటి ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేకపోయిన వాళ్లకు నామినేటెడ్ మొదటి లిస్టులో కొంతవరకూ అవకాశం ఇచ్చామన్నారు. గత ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేకమైన విధానాన్ని పాటించి మంచి ఫలితాలు సాధించినట్టే.. నేడు నామినేటెడ్ పదవుల విషయంలోనూ సుదీర్ఘ కసరత్తు చేసి పదవులు ప్రకటించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఫేజ్ 1లో ముందుగా కొందరికి పదవులివ్వగలిగామంటూనే.. ఇంకా నామినేటెడ్ పోస్టుల లిస్టులు ఉన్నాయన్నారు.
పదవుల విషయంలో కొందరు నాయకులు తొందర పడటం మంచి పద్దతి కాదంటూనే.. క్రమశిక్షణకు పార్టీ ప్రాధాన్యమిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఒకరికి అవకాశం వచ్చిందంటే.. మిగిలినవారు పనిచేయలేదని, అర్హత లేదని అర్థంకాదన్నారు. జైలుకెళ్లిన వాళ్లు, ఆస్తులు కోల్పోయిన వాళ్లు, కేసులు ఎదుర్కొన్నవారు ఉన్నారు. పార్టీకి ఎవరు ఎలా పనిచేశారో నా దగ్గర పూర్తి సమాచారం ముందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వాళ్లున్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే విషయంలో స్పష్టంగా ఉన్నామని, కష్టపడిన ఏ ఒక్కరినీ విస్మరించేది ఉండదన్నారు. నామినేటెడ్ పదవుల పందేరంలో సామాజిక న్యాయం పాటించామంటూనే.. జనాభా దామాషా లెక్కన బీసీలకు నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ ప్రాధాన్యమిచ్చామని చంద్రబాబు వివరించారు. పదవులు అందుకున్నవారు తమతమ విభాగాలను ముందుగా అవగాహన చేసుకుని.. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చో లోతుగా అధ్యయనం చేయాలన్నారు.
పెట్టుబడుల రాబడట్టడంలో, పరిశ్రమల ఏర్పాటు చేయడంలో ఏపిఐఐసీ పాత్ర కీలకమని, మౌలిక సదుపాయాల కల్పనతో పెద్దపెద్ద కంపెనీలను తీసుకురావచ్చన్నారు. మనం పరిశ్రమల కోసం భూములు సేకరిస్తే…. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు కేటాయించి లక్ష్యం నెరవేరకుండా చేసిందని గుర్తు చేశారు. పరిశ్రమలు వస్తే ఉపాధి, ఉద్యోగాలు ఉంటాయని, జగన్ మాత్రం ఇళ్ల స్థలాల పేరుతో వాటిని ఇచ్చాడని వ్యాఖ్యానించారు. ఆర్టీసీని నిలబెట్టాలి.. ఎలక్ట్రిక్ బస్సులు తేవాలి.. కార్గో పెంచాలి… ఇవన్నీ ఆర్టీసీ చైర్మన్ ఆలోచించాల్సిన విషయాలని ఉదహరించారు. నేతలకే కాదు…. ట్రాక్ రికార్డుల ఆధారంగా చిన్నస్థాయి నేతలకూ కార్పొరేషన్లలో అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని చంద్రబాబు సూచించారు. కష్టపడి పనిచేస్తే మరిన్ని మంచి అవకాశాలు వస్తాయంటూ…మనకు వచ్చిన విజయాన్ని మరింత పెంచేలా ప్రతి ఒక్కరూ పనిచెయ్యాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ‘మీ వల్ల కూటమి ప్రభుత్వానికి పొలిటికల్ గెయిన్ ఉండాలి. ఆల్ ది బెస్ట్’ అంటూ కార్పొరేషన్ల చైర్మన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.