- దుష్టుల నిగ్గుతేల్చందుకు వేగంగా దర్యాప్తు
- పాప పరిహారార్థం తిరుమలలో శాంతిహోమం
- వెంకన్న అన్ని ఆలయాల్లో శుద్ధి నిర్వహణ
- మత నియమాల అమలుకు అవసరమైతే చట్టం
- మతసామరస్య పరిరక్షణ సీఎంగా నా బాధ్యత
- నిర్ణయాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఉండవల్లి (చైతన్య రథం): ఆపద మొక్కులవాడు వేంకటేశ్వర స్వామి మహాప్రసాదానికి అపచారం జరిగిన నేపధ్యంలో.. పాప ప్రక్షాళనకు ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన నిర్ణయాలే తీసుకున్నారు. తొలుత వెంకన్నపట్ల పాపపరిహారార్థం తిరుమల ఆలయంలో శాంతిహోమం చేపడతామన్నారు. పవిత్ర ఉత్సవాలతో దోషాలు తొలగిపోయినా. ఇప్పుడు శ్రవణం వల్ల, వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతిహోమం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తుకు సిట్ వేస్తాం. ఐజీస్థాయి పర్యవేక్షణలో సిట్ ద్వారా ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నాం. నిర్థిష్ట సమయంలో దర్యాప్తు పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తారన్నారు. ఏ ప్రార్థనా మందిరంలో ఆ మతం వాళ్లే యాజమాన్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీని కోసం అవసరమైతే కొత్తచట్టం తెస్తామని ప్రకటించారు. దేవాలయాలు, మసీదులు, చర్చిల సాంప్రదాయాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అన్ని దేవాలయాల్లో ఆగమ శాస్త్రాల ప్రకారం అన్నిచోట్లా ప్రోక్షణ, శుద్ధి కార్యక్రమం చేపడతామన్నారు. దేవాలయాల నిర్వహణపై అన్నీ స్టడీ చేసి స్టాండర్డ్ ఆపరేషన్ తయారుచేసి వాటిని పాటించే విధానం తెస్తామన్నారు. దీని కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని, మహిళలను గౌరవించేలా ప్రత్యేకమైన క్యూలు ఏర్పాటు చేసే అంశంపైనా నిర్ణయాలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
నిబంధనలకు నీళ్లొదిలారు
‘టెండర్లన్నీ రద్దుచేసి రివర్స్ టెండర్లని పెట్టి నిబంధనలు మార్చారు. నెయ్యి సరఫరా చేయాలంటే మూడేళ్లపాటు డైరీకి అనుభవం ఉండాలి. దాన్ని యేడాదికి తగ్గించారు. నాలుగు లక్షల లీటర్లు ఉత్పత్తిచేసే డైరీకి అప్పగించాల్సి ఉన్న నిబంధనను మార్చి ఎవరైనా సరఫరా చేయొచ్చు అనే విధంగా మార్చారు. రూ.250 కోట్లు యేడాదికి కనీసం టర్నోవర్ ఉండాలి. దాన్ని రూ.150 కోట్లకు తగ్గించారు. ఈవిధంగా ఇష్టానుసారంగా నిబంధనలు మార్చారు. ఏఆర్ డెయిరీ అని తమిళనాడు నుండి తీసుకొచ్చారు. 10 లక్షల కేజీల ఆవు నెయ్యికి గత మార్చి 12న ఈ`టెండర్ పిలిచారు. గత మే8న టెండర్ ఫైనలైంది. కిలో ధర రూ.319.90 ఫైనల్ చేశారు. రూ.319లకు కనీసం డాల్డా రావడం లేదు. అలాంటిది ఆవు నెయ్యి కొనుగోలకు టెండర్ ఫిక్స్ చేశారు. జూన్ 12 నుండి సరఫరా మొదలైంది. జూలై 6న వచ్చిన రెండు ట్యాంకులు, 15న వచ్చిన మరో రెండు ట్యాంకుల నెయ్యి నాణ్యత లేదని గుర్తించారు. ప్రక్షాళన మొదలు పెట్టి, అపవిత్ర కార్యక్రమాలన్నీ పక్షాళన చేసి పుణ్యక్షేత్రానికి పూర్వవైభవం తీసుకురావడానికి నాకు భగవంతుడు ఆదేశాలు ఇచ్చారని ఈఓ శ్యామలారావుకు చెప్పాను.
తర్వాత నుండి రోజురోజుకు మార్పులు చోటు చేసుకున్నాయి. సప్లై చేసేవాళ్లు సరిగా చేయకపోతే వార్నింగ్ ఇచ్చినా వినలేదు. నాలుగు ట్యాంకర్లలోని నెయ్యి శాంపిల్స్‌ను ఎన్డీడీబీ ల్యాబ్‌కు జూలై 16న పంపిస్తే 23న రిపోర్టులు వచ్చాయి. ఆ రిపోర్టుల ఆధారంగా చర్యలు ప్రారంభించారు. నాణ్యత లేదు అనేది ప్రసాదం తిన్న ప్రతిఒక్కరూ చెప్పారు. రిజల్ట్ నెంబర్1లో ఎస్.వాల్యూ 86.62 ఉంది. కానీ ఉండాల్సింది 98.05 నుండి 101.95 ఉండాలి. దీనికి కారణం ఆలివ్, సోయాబీన్, సన్ ఫ్లవర్, ఫిష్ ఆయిల్ ఉండటమే. నెంబర్3 లో 22.43 ఎస్ వాల్యూ ఉంది. 95.90 నుండి 104.10 ఉండాలి. ఇది రావడానికి కారణం పామాయిల్, బీఫ్ కొవ్వు ఉండడం. నెంబర్ 4లో ఎస్ వాల్యూ 117.42 ఉండాలి. కానీ 97.96 నుండి 102.04 ఉంది. దీనికి కారణం పంది కొవ్వు ఉండటం. ఇవన్నీ చూశాక ఈవో నోటీసు ఇచ్చి నెయ్యి సప్లై చేసే డైరీని బ్లాక్ లిస్టులో పెట్టారు’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
అపచారం చేసిన మీకు మంచి వాళ్లు అని సర్టిఫికేట్ ఇవ్వాలా.?
‘నేను ప్రక్షాళన చేయాలని చెప్పాను…దీంతో ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇవి చూశాక ప్రజలు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. రిపోర్టులు బయటకు రాకుండా చూశారు. చేసిన తప్పునకు క్షమాపణ చెప్పకుండా మళ్లీ ఎదురుదాడి ప్రారంభించారు. చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరం ఇది. భక్తుల మనోభావాల పట్ల గౌరవం ఉంటే ఎదురుదాడి చేస్తారా?. మీరు ఎదురు దాడి చేస్తే మంచి వాళ్లు అని సర్టిఫికేట్ ఇవ్వాలా.? వెంకటేశ్వరస్వామికి అపచారం చేసి, రిపోర్టు తారుమారు చేస్తే సహకరించాలా.? నిన్నటి నుండి ఒక్కొక్కరి స్టేట్ మెంట్ చూస్తే గుండె రగిలిపోతుంది. మీకు నమ్మకం లేకపోతే దూరంగా ఉండండి. సీఎంగా ఉన్నంత వరకు మతసామరస్యం కాపాడటం నా బాధ్యత. నేను నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నా కర్తవ్యం. వేరే మతాలను ద్వేషించడం నేను ఎప్పుడూ చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో చర్చిలపై దాడులు జరిగితే మెదక్, తాడేపల్లిగూడెం వెళ్లి పరిశీలించి చర్యలు తీసుకున్నాను.’ అని గుర్తు చేశారు.