అమరావతి (చైతన్యరథం): కాకినాడ పోర్ట్ వేదికగా ప్రజా పంపిణీ వ్యవస్థ (ఐఈడీఎస్) బియ్యం విదేశాలకు తరలించడంపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ బృందంలో సభ్యులుగా సీఐడీ ఎస్పీ బి ఉమామహేశ్వర్, డీఎస్పీలు టి అశోక్ వర్ధన్, ఎం. బాలసుందర్రావు, ఆర్ గోవిందరావు, ఎం రత్తయ్యలను నియమించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కేసుకు సంబంధించిన పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఆదేశించింది. అలాగే సిట్‌కు పూర్తి స్థాయి అధికారాలు కట్టబెట్టింది. పోర్టు ద్వారా బియ్యం విదేశాలకు రవాణా, కాకినాడ జిల్లాతోపాటు అందుకు సంబంధిత నేరాలపై విచారణ జరపాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ దర్యాప్తులో భాగంగా సిట్‌కు.. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం అందించేందుకు సహకరించాలని సూచించింది. అలాగే తనిఖీ, సీజ్ చేసే అధికారంతోపాటు సాక్ష్యులను విచారించి అవసరమైన పత్రాలను పొందే హక్కు సైతం సిట్‌కు ప్రభుత్వం కల్పించింది. అదే విధంగా చట్టపరంగా నిందితులను అరెస్ట్ చేసి.. విచారించే హక్కును సైతం సిట్‌కు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో 13 ఎఫ్‌ఐఆర్ లు నమోదయ్యాయి.