కడప: వైసీపీకి చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి సంబంధించిన ప్రైవేటు పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరికి బలమైన గాయాలు కాగా… నగరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కడప నగరంలోని అక్కయ్యపల్లిలో సాయిబాబా ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి గదిలో మంగళవారం మధ్యాహ్నం స్లాబు పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం మీడియా దృష్టికి రావడంతో విద్యార్థులను తిరిగి పాఠశాలకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కడప జిల్లా అక్కాయపల్లిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో పైకప్పు కూలి ఆరుగురు విద్యార్థులు గాయపడిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. సంబంధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించాను. నిబంధనలు పాటించకుండా స్కూలు నడుపుతున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని నారా లోకేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.