- పోర్టుల నుంచి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
- కాకినాడ పోర్టులో ఐదు గోడౌన్లలో సార్టెక్స్ మిషన్ల ఏర్పాటుపై విచారణ
- చీఫ్ సెక్యూరిటీ అధికారి నియామకంతో పోర్టులో భద్రత మరింత కట్టుదిట్టం
- మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు
- పోలీస్, రవాణా, సివిల్ సప్లయిస్, మారిటైమ్ బోర్డు అధికారులతో సమీక్ష
అమరావతి (చైతన్యరథం): పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సమావేశమై ఈ అంశంపై చర్చించింది. ఈ సమావేశంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, శాంతిభద్రతల ఐజీ, సివిల్ సప్లయిస్ ఎక్స్ అఫిషియో సెక్రెటరీ, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండీ, మారిటైమ్ బోర్డు సీఈఓ, కస్టమ్స్, కాకినాడ పోర్టు, రవాణాశాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టులో జరుగుతున్న వ్యవహారాలపై చర్చించారు. కాకినాడ పోర్టులో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా కాకినాడ పోర్టు భద్రత కోసం చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తున్నందున పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ పోర్టు, పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలపై నిఘాను కట్టుదిట్టం చేయనున్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కాకినాడ పోర్టులోని ఐదు గోడౌన్లలో సార్టెక్స్ మిషన్లు ఉన్న అంశంపై చర్చించారు. గోడౌన్లలో యంత్రాలు ఏ విధంగా ఏర్పాటు చేశారని మారిటైమ్ బోర్డు, కాకినాడ పోర్టు అధికారులను మంత్రులు ప్రశ్నించారు. సార్టెక్స్ యంత్రాలను ఏర్పాటుపై విచారణ చేపట్టాలని, అందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.