అమరావతి,చైతన్యరథం: ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియలో ఏపీపీఎస్సీ గత ప్రభుత్వం హాయంలో సృష్టించిన గందరగోళాన్ని సరిదిద్ది నిరుద్యోగులకు న్యాయం చేయాలని రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేష్, ఏపీపీఎస్సీ సెక్రటరీని టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, శ్రీకాంత్, రాంగోపాల్‌రెడ్డిలు కోరారు. ఈ వినతిపై వారిద్దరూ సానుకూలంగా స్పందించారు. గ్రూప్ 2 పోస్టుల నియమాకానికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని వివిధ జిల్లాల నుండి అభ్యర్ధులు ఎమ్మెల్సీలను కోరారు. గ్రూప్ 2లో కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్‌ను చేర్చారని, ఇది తెలుగులో గ్రామీణ విద్యార్ధులకు అందుబాటులో లేదని, మరోవైపు అగస్టులో మెయిన్స్ పరీక్షలు నిర్వహించబోన్నందున ఇది ఇబ్బందిగా మారిందని అభ్యర్దులు తెలిపారు. దీంతో పరీక్షను వాయిదా వేయాలని కోరారు. అలాగే డిప్యూటీ ఈవోకు సంబంధించి ఈ నోటిఫికేషన్ 17 సంవత్సరాల తర్వాత వచ్చిందని, ఈ నోటిఫికేషన్ సమయంలో ఎలక్షన్ విధులు ఉండడం, పేపర్ వాల్యూయేషన్ ఉండడం, సర్వీసు శిక్షణ ఉన్న కారణంగా మెయిన్స్ పరీక్షకు 1:50 కాకుండా 1:100 పిలవాలని నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఎంఈవోలు ఎమ్మెల్సీలను కోరారు. గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు వెల్లడిరచేప్పుడు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో మెరిట్ లిస్ట్ పెట్టాలని , కేంద్రంలో యుపిపిఎస్‌సి వలే రాష్ట్రంలో ఏపీపీఎస్‌సి ద్వారా జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని, ఇంటర్వ్యూలు పారదర్శకంగా జరిగేలా చూడాలని నిరుద్యోగులు ఎమ్మెల్సీలను కోరగా వారు ఈ విషయాలను ఏపీపీఎస్‌సి సెక్రటరీకి నివేదించారు.