వర్షానికి, ఆకాల వర్షానికి తేడా తెలియని స్థితిలో రాష్ట్ర వ్యవ సాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారని ఇలాంటి వ్యక్తికి పీహెచ్ డీ ఎలా వచ్చిందో తెలియడం లేదని ఇది జిల్లా ప్రజలు చేసుకున్న దురదృష్టమని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. స్థానిక మినీబైపాస్ లోని టిడిపి జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్ 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆకాలవ ర్షాలు కురుస్తున్నాయని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారణమన్నారు. రైతులను ఆదుకునేందుకు అధికారులను అప్రమత్తం చేయడం తోపాటు సమీక్షలు నిర్వహించాల్సిన భాధ్యత వ్యవసాయ మంత్రి కాకాణీకి లేదా అని ప్రశ్నించారు. ఇకనైనా నిద్రావస్థ నుంచి మేలుకొని ఆకాలవర్షంతో రైతులకు జరిగిన నష్టాన్ని అంచనావేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ రోజు వరకు వ్యవసాయశాఖ మంత్రి కాకాణికి గానీ, అధికారులకు గానీ దెబ్బతిన్న పంటలను పరిశీలించే తీరకలేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే వర్షాలు కురవడం తెలుగుదేశంపార్టీ నాయకులకు ఇష్టంలేదని మంత్రి కాకాణి సెలవిచ్చారని ఎద్దేవా చేశారు. గత టిడిపి పాలనలో వ్యవసాయశాఖకు కేటాయించింది ఎంత. ఖర్చు చేసిందెంత. ప్రస్తుత వైసీపీ పాలనలో కేటాయింపులెంత ఖర్చులెంత చేశారో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు.
15కోట్లు విలువైన రంగురాళ్లు దోపిడి: అయ్యన్న
వైసిపి నాయకులు 15 కోట్ల రూపాయల విలువైన రంగురాళ్లను దోచుకో పోయినా అటవీ శాఖ అధికారులు కనీసం స్పందించలేదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ రంగురాళ్లు తవ్వకాలమట్టిని ఈ నెల 21న 12 ట్రాక్టర్లల్లో పట్టుకుపోయారని ఆరోపించారు. ఈ మట్టిని ఎక్కడికి తరలించారో ఇంతవరకు అధికారులు తెలుసుకోలేదన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే రంగురాళ్ల క్వారీ వద్ద కాపలా ఉన్న అటవీశాఖ సిబ్బందిని అక్కడ నుంచి పంపించివేసి తవ్వకాలను జరిపారన్నారు. ఇందులో వైసిపి నాయకుల పెద్దల హస్తం ఉందన్నారు. దీనిపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.