- సౌర, పవన్ విద్యుత్ ప్రాజెక్టుల హబ్‌గా ఏపీ
- రెన్యువబుల్ ఎనర్జీ సదస్సులో మంత్రి గొట్టిపాటి
గాంధీనగర్: విద్యుత్ స్టోరేజీకి ఆంధ్రప్రదేశ్‌ను చిరునామాగా నిలిపే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికమార్ తెలిపారు. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మారుస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో జరుగుతున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో రెండోరోజు మంగళవారం మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో చర్చించామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు, మానవ వనరుల గురించి వివరించారు. ఏపీలో పునరుత్పాదక విద్యుత్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ ను అందించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నట్లు రవికుమార్ ఇన్వెస్టర్లకు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తాము కీలక లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకునే దిశగా సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ లో ప్రోత్సహిస్తున్నామన్నారు. దీనితో పాటు విద్యుత్ స్టోరేజి సాంకేతికత కూడా వినియోగిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 3.0 సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఇన్వెస్టర్లకు తెలిపారు. తెలిపారు. ఇందులో భాగంగా విద్యుత్ స్టోరేజి విధానంపై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. విద్యుత్ స్టోరేజికి ఆంధ్రప్రదేశ్ ను కేరాఫ్ అడ్రెస్ గా నిలిపే లక్ష్యంతో తాము పని చేస్తున్నామని.. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను ఎనర్జీ క్యాపిటల్‌గా గుర్తింపు తీసుకొస్తామన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున బ్యాటరీ స్టోరేజి విధానం, పంప్డ్ హైడ్రో స్టోరేజి, ఇతర అభివృద్ధి చెందిన విద్యుత్ స్టోరేజి సాంకేతికతను వినియోగిస్తామని చెప్పారు. రూఫ్‌టాప్ సోలార్, డీ- సెంట్రలైజ్డ్ మైక్రో గ్రిడ్ల ఏర్పాటుతో విద్యుత్ ఉత్పత్తిని ప్రజలకు మరింత చేరువ చేసి, క్షేత్రస్థాయిలో ఇంధన భద్రత పెంచుతామని వివరించారు.