- కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలి
- ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్
అమరావతి (చైతన్యరథం): ఈనెల 5,6 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో జరుగనున్న కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన అంశాలపై ఆయా శాఖల కార్యదర్శులతో శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను శాఖల వారీగా సీఎస్ సమీక్షించారు. రానున్న 100 రోజుల కార్యాచరణపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు కలెక్టర్లకు దిశా నిర్దేశం చేసే విధంగా ప్రజెంటేషన్ ఉండాలని కార్యదర్శులకు సీఎస్ స్పష్టం చేశారు. కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన మినిట్ టు మినిట్ కార్యక్రమంపై చర్చించారు. 5వ తేది ఉదయం 10గంటల నుండి 11 గంటల మధ్య సీఎం, డిప్యూటీ సీఎం, తదితరుల ప్రారంభ ఉపన్యాసాలు ఉంటాయన్నారు.
తదుపరి పలు అంశాలపై సమీక్ష ఉంటుందని చెప్పారు. 6వ తేదీన కలెక్టర్లు, ఎస్పీలతో సంయుక్త సమావేశం ఉంటుందని సీఎస్ తెలిపారు. ఈ వీడియో సమావేశంలో ఎంఏయుడి, వైద్య ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అనిల్ కుమార్ సింఘాల్, ఎం.టి.కృష్ణబాబు,ఆ ర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.ఆదినారాయణ, ప్రణాళికా శాఖ సంచాలకులు రాంబాబు, తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే రెవెన్యూ, వ్యవసాయ, అటవీ, ఇంధన, గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆర్పీ సిసోడియా, బి.రాజశేఖర్, అనంత రాము, కె.విజయా నంద్, అజయ్ జైన్, అదనపు డిజి కుమార్ విశ్వజిత్, సిసిఎల్‌ఏ జి.జయలక్ష్మి, ముఖ్య కార్యదర్శులు కాంతి లాల్ దండే, కె.సునీత, శశి భూషణ్ కుమార్, సురేశ్ కుమార్, కార్యదర్శులు కె.శశిధర్, సౌరవ్ గౌర్, తదితరులు పాల్గొన్నారు.