- 9 నెలల క్రితం అదృశ్యమైన యువతిని జమ్ములో గుర్తించారు
- ఈ కేసు ఛేదించిన పోలీసులకు అభినందనలు
- 30 వేల మంది యువతులు అదృశ్యమైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదు
- తల్లితండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలి
కాకినాడ: తమ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తన కూతురు కిడ్నాప్‌నకు గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం. పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూకశ్మీర్ లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు. 9 నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును 48 గంటల్లో ఛేదించారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇటీవల పవన్ కల్యాణ్ గ్రీవెన్స్ సెల్ నిర్వహించగా, తన కూతురు 9 నెలలుగా కనిపించట్లేదని, పోలీసులు ఈ కేసును పట్టించుకోవడం లేదని.. భీమవరానికి చెందిన శివకుమారి అనే మహిళ విన్నవించుకుంది. విజయవాడలో చదువుతున్న తన కుమార్తెను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, కిడ్నాప్ చేశారని బాధితురాలు శివకుమారి తెలిపారు. చాలా కాలం గడిచినా కుమార్తె జాడ తెలియడంలేదని వాపోయారు. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని పవన్‌కు ఆమె ఫిర్యాదు చేశారు.
ఆమె బాధను చూసి పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించారు. శివకుమారి వద్ద ఎఫ్‌ఐఆర్ కాపీని పరిశీలించారు. వెంటనే మాచవరం సీఐకి ఫోన్ చేసి మిస్సింగ్ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసును సత్వరం ఛేదించాలని ఆదేశించారు. దీంతో విజయవాడ పోలీసులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడితో సదరు యువతి జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి నుంచి స్పెషల్ టీం వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జమ్మూ నుంచి యువతి, యువకుడిని విజయవాడకు తీసుకొస్తున్నారు. పవన్ అలెర్ట్ చేయడంతో ఈ కేసును విజయవాడ పోలీసు కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు. యువతి ఎక్కడ ఉందో ట్రేస్ చేసి స్పెషల్ టీంను జమ్ముకు పంపించారు. ఈ కేసును పవన్ ప్రస్తావిస్తూ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ప్రభుత్వం తలచుకుంటే ఎలాంటి కేసునైనా పరిష్కరించగలదని నిరూపించడానికేనని పవన్ చెప్పారు.
గత ప్రభుత్వం పట్టించుకోలేదు
గత ఐదేళ్లలో ఎంత మంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలి. ఇదే రీతిలో మిగతా కేసులను కూడా తీవ్రంగా పరిగణించి అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ నిర్దేశించారు. ఈ వ్యవహారంలో ఎక్కడో ఒక చోట కదలిక మొదలైతే తప్ప ఇది తీవ్రరూపం దాల్చదని అన్నారు. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిల ఆచూకీ లేదని, వారు ఎక్కడ ఉన్నారన్నది తెలుసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అదృశ్యమైన యువతుల ఆచూకీ కోసం స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని రాష్ట్ర క్యాబినెట్ దృష్టికి తీసుకెళతానని వెల్లడిరచారు. పోలీసు అధికారులతో మాట్లాడి దీనిపై ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంపై ఆలోచిస్తామని చెప్పారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి విషయాల్లో పోలీసులు కూడా ఒక్కోసారి నిస్సహాయంగా మారిపోతుంటారని వివరించారు. అయితే, ఏపీ పోలీసులను మాత్రం ఈ విషయంలో అభినందించాలని, ఓ అమ్మాయి అదృశ్యమైన 9 నెలల తర్వాత కూడా ఆచూకీ తెలుసుకోగలిగారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు.
త్వరలో ఉప్పాడ తీరాన్ని పరిశీలిస్తా..
ఉప్పాడ తీరం కోతకు గురవుతున్న నేపథ్యంలో దాన్ని ఎలా రక్షించుకోవాలనే అంశంపై క్షేత్రస్థాయి పర్యటన చేస్తా. ఈ పర్యటన పూర్తయ్యేలా సహకరించాలని అక్కడి యువతను కోరుతున్నా. తీరం కోత గురించి నిపుణుల బృందం అధ్యయనం చేస్తుంది. ఎక్కువ మంది తెలుగు వాళ్ళు విదేశాల్లో ప్రస్తుతం సీఈవోలుగా ఉన్నారు. మనదేశానికి, రాష్ట్రానికి సంబంధించిన యువత ప్రతిభను ఇక్కడే వినియోగించుకునేలా అవకాశాలు కల్పించాలి. శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ అన్నారు.
శాఖల వారీగా సమీక్ష
అంతకు ముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, పలు శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో ఉన్న పరిస్థితులను అధికారులు పవన్ కల్యాణ్ కు వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, పంతం నానాజీ కూడా పాల్గొన్నారు.