విశాఖపట్నం: కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శ్రీనివాసులు హత్యపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. బుధవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆ హత్యపై కర్నూలు ఎస్పీతో ఫోన్లో మాట్లాడానని, నిందితుల్ని పట్టుకుని చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని హోంమంత్రి అనిత తెలిపారు. మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు రాజకీయ హత్యలు జరిగాయని, అందులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలు హత్యకు గురయ్యారన్నారు. తాజాగా టీడీపీకి చెందిన నాయకుడు హత్యకు గురయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క వైసీపీ నాయకులను చంపేస్తున్నారని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. వైసీపీ నాయకులు కావాలనే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సరిగా లేదని క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. హత్య చేసిన నిందితులను ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎంతోమంది త్యాగాలు, పోరాటాలు ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని.. స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపైన ఉందన్నారు.