ఉండవల్లి (చైతన్య రథం): కూటమి పార్టీలమధ్య వారధిగా, ఆత్మీయ ఆతిథ్య సారథిగా నిలుస్తూ విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్లవారీగా నిర్వహిస్తోన్న ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి ఉండవల్లి నివాసానికి కుటుంబసభ్యులతో కలిసి హాజరైన కడప, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు లోకేష్ ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో మాటలు, ముచ్చట్లతో ఒకింత సమయాన్ని సరదాగా గడిపారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జవాబుదారీతనానికి నిదర్శనంగా, ప్రజాప్రతినిధులు ఎవరూ అడగకుండానే వారు ఇచ్చిన వినతులు పరిష్కారం అయినవి, పరిష్కార దశలో ఉన్నవి, పెండింగువి తెలియజేస్తూ నివేదికలు అందజేశారు. ఆహ్లాదకర వాతావరణంలో విందు జరిగింది. ఇంట్లో శుభకార్యం నిర్వహించినప్పుడు పాటించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఆడపడుచులకు మంగళగిరి పట్టుచీరలు పెట్టారు. ఆత్మీయ కలయికకు కడప, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిధి ఎమ్మెల్యేలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి (కడప), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు-బీజేపీ), పుత్తా క్రిష్ణచైతన్య రెడ్డి (కమలాపురం), ఎన్ వరదరాజులురెడ్డి (ప్రొద్దుటూరు), ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాలరెడ్డి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (రాయచోటి), నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి (పీలేరు) షాజహాన్ బాషా (మదనపల్లె) కుటుంబసభ్యులతో హాజరయ్యారు.













