అమరావతి (చైతన్య రథం): శ్రీశైలం `హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, శ్రీశైలం ఘాట్ రోడ్డుతోపాటు దేవాలయానికివెళ్లే మార్గాల్లో రద్దీని చక్కదిద్దాలని సూచించారు. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రాకపోకలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వత పరిష్కారానికి సమగ్ర అధ్యయనం చేపట్టాలని అధికారులకు నిర్దేశించారు. కార్తీక మాసం కావడంతో వేలాదిగా భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వస్తున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రానున్న రోజుల్లో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యను స్వయంగా పరిశీలించి, పరిష్కార మార్గానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆదేశించారు. అవసరమైతే పొరుగు రాష్ట్ర అధికారులతో సమస్యపై చర్చించి, సమన్వయంతో భక్తుల ఇబ్బందులను తొలిగించాలన్నారు.