- మా దగ్గర ఆధారాలున్నాయి
- బాధ్యులైన ఎవరినీ వదలం
- అహంకారంతో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి
- మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ
రేణిగుంట(చైతన్యరథం): శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గురువారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతిపై స్పష్టంగా చెప్పాం. అన్న ప్రసాదంలో నాణ్యత లేదు, తిరుమల లడ్డూ సైజుతో పాటు నాణ్యత కూడా తగ్గిపోయింది. నేను చంద్రగిరిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ ఏడుకొండల వైపు చూసి జగన్‌కు చెప్పాను… ఆ ఏడుకొండల జోలికి వెళ్లొద్దు… సర్వనాశనం అయిపోతారని చెప్పాను. కానీ వినలేదు. తిరుమలలో కనీవినీ ఎరుగని అవినీతి చేశారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని మంత్రి లోకేష్ వివరించారు. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారనేందుకు మా దగ్గర ఆధారాలున్నాయి. నాణ్యత పరీక్షల కోసం నెయ్యిని ఎన్డీడీఎఫ్‌కు పంపించాం. జంతువుల కొవ్వుతో తయారైన నూనె ఉందని వారు నిర్ధారించారు. కల్తీ నెయ్యికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు.. నేను తిరుపతిలోనే ఉన్నా.. వైవీ వచ్చి కల్తీ నెయ్యి అంశంపై ప్రమాణం చేస్తారా అని లోకేష్ సవాల్ విసిరారు. నాటి వైసీపీ ప్రభుత్వం సామాన్య భక్తులను స్వామివారికి దూరం చేసిందని విమర్శించారు. ధరలను విపరీతంగా పెంచేసిందని ఆరోపించారు. ధరలు పెంచితే ఏమవుతుందని నాడు టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైైవీ అహంకార ధోరణితో మాట్లాడారని మండిపడ్డారు. పింక్ డైమండ్‌ను కూడా రాజకీయం చేశారని లోకేష్ విమర్శించారు.
ఘన స్వాగతం
రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌కు గురువారం రాత్రి ఘన స్వాగతం లభించింది. తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిడి నెల్లూరు ఎమ్మెల్యే విఎం.థామస్, అదనపు ఎస్పీ నాగభూషణం రావు, ఆర్డీఓ రవి శంకర్ రెడ్డి, ఎస్‌డిసి ప్రోటోకాల్ చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం వరద బాధితుల కోసం విరాళంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 57,48,408 చెక్కును మంత్రి లోకేష్‌కు జిల్లా కలెక్టర్ అందజేశారు.
యువనేత లోకేష్‌కు ప్రజల బ్రహ్మరథం
విమానాశ్రయం వెలుపల టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు మంత్రికి అపూర్వ స్వాగతం పలికారు. యువనేతకు స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అనంతరం మంత్రి లోకేష్ రోడ్డు మార్గాన చిత్తూరు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అభిమానుల తాకిడితో ఎయిర్ పోర్టు పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గాన మంత్రి నారా లోకేష్ బంగారుపాళ్యం బయలుదేరారు. దారి పొడవునా యువనేతను స్వాగతిస్తూ భారీ ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గంలో ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు హర్ష ద్వానాలతో స్వాగతం పలికారు. బంగారుపాళ్యం మార్గమధ్యలో అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చుతూ అభిమానాన్ని చాటుకున్నారు. రాత్రి 11గంటల సమయంలోనూ చిత్తూరు శివార్లలో భారీగా రోడ్డుపైకి వచ్చి యువనేతకు స్వాగతం పలికారు. యువనేత లోకేష్ కోసం అభిమానులు రోడ్ల వెంట బారులు తీరి వేచి చూశారు.