అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వ మంత్రివర్గం ఈ నెల 16న సమావేశం కానుంది.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. కేబినెట్ భేటీలో ముఖ్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలపై చర్చించనున్నారు. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. ఓట్ ఆన్ అకౌంట్‌పై ఇచ్చే ఆర్డినెన్స్‌కు సైతం కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది.ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అమలు చేయాల్సిన పథకాలపైనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాల పరిమితి జులై 31 వరకు ఉంటుంది. దాంతో, ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ కోసం కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే కేబినెట్ భేటీకి సంబంధించి మంత్రులకు సమాచారం కూడా వెళ్లింది.