- అభివృద్ధి కావాలంటే ఎన్డీఏని గెలిపించాలి
- నెల్లూరు స్వర్ణాంధ్ర సాకార సభలో బాలకృష్ణ
నెల్లూరు: నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూనే… ఆ వర్గాలను జగన్‌రెడ్డి దారుణంగా అణిచేశాడని టీడీపీ అగ్రనాయకుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరులో శుక్రవారం ‘స్వర్ణాంధ్ర సాకార సభ’లో బాలకృష్ణ మాట్లాడుతూ పైకేమో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడు.. వైసీపీ నేతలు ఎస్సీలను దారుణంగా చంపి డోర్ డెలివరీలు చేస్తున్నా చర్యలు తీసుకోడని జగన్‌పై విరుచుకుపడ్డారు. దళితుల కోసం టీడీపీ అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశాడని దుయ్యబట్టారు. అప్పులు, రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలోకి తీసుకెళ్లారన్నారు. రూ.1600 కోట్లతో రాష్ట్రమంతా సిద్ధం.. సిద్ధం.. అని హోర్డింగులు పెట్టుకున్నాడని, దేనికి సిద్ధం కావాలని బాలకృష్ణ ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్లకు పాతరేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, పరిశ్రమలని తరిమేసి ఉన్న ఉద్యోగాలని కూడా పీకేశాడని మండిపడ్డారు. కరెంట్, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచేశారని, నిత్యావసర సరుకుల ధరలేమో ఆకాశాన్నంటుతున్నాయన్నారు.
పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారంటూ దుయ్యబట్టారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి వైజాగ్‌లో యథేచ్ఛగా భూములు కబ్జా ్జచేశారని, జగన్‌రెడ్డి.. రుషికొండకు బోడిగుండు కొట్టించి ప్యాలెస్ కట్టించుకున్నారని విమర్శించారు. వైజాగ్‌ను నాశనం చేసిన విజయసాయి ఇప్పుడు నెల్లూరు వచ్చారనన్నారు. ఇక్కడి మంత్రి కాకాణి కాకమ్మ కబుర్లు చెబుతుంటాడు. ఆయన కళ్లు పడితే భూములన్నీ కబ్జాలే. అభివృద్ధి కావాలా? అరాచకాలు కావాలా..స్వర్ణయుగం కావాలా? రాతియుగం కావాలా.. సుపరిపాలన కావాలా? రాక్షస పాలన కావాలా.. చీకటి రాజ్యం కావాలా అని ప్రజలను బాలకృష్ణ ప్రశ్నించారు. అభివృద్ధి కావాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపు ఇచ్చారు.