ఢిల్లీ (చైతన్య రథం): కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో 40 నిమిషాల పాటు అనేక అంశాల పై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేపట్టిన అనేక కార్యక్రమాలను అమిత్ షా కు మంత్రి లోకేష్ వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్నందుకు అమిత్ షా కు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలు అధిగమించి రాష్ట్రం బలమైన శక్తి గా ఎదిగేందుకు కేంద్ర సహాయం ఉంటుందని ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంపై ఎక్స్ లో మంత్రి లోకేష్ స్పందించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం చాలా ఫలవంతంగా జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని తాజా పరిణామాల గురించి ఆయనకు తెలియజేశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ బలమైన ఆర్థిక శక్తిగా పునరుజ్జీవం పొందేలా.. కోట్లాది తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి.. అద్భుతమైన నిబద్ధతతో కృషి చేస్తున్న అమిత్ షా కు కృతజ్ఞతలు తెలుపుతున్నాన న్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి గొప్ప భవిష్యత్తు సృష్టించడంలో.. అమిత్ షా అందిస్తున్న నిరంతర మార్గదర్శనానికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నానని లోకేష్ పోస్ట్ చేశారు