- జనవరిలో జన్మభూమి 2.0 ప్రారంభం
- గుడివాడ ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- అన్న క్యాంటీన్ ప్రారంభించి చిరువ్యాపారులతో సీఎం మాటామంతీ
- సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే కలెక్టర్‌కు ఆదేశాలు
గుడివాడ(చైతన్యరథం): పేదలకు కడుపునిండా తిండి పెట్టడం జీవితంలో సంతృప్తినిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా అభివృద్ధి చేయటమే తన ధ్యేయమన్నారు. పేదరిక నిర్మూలన జరిగేవరకు శక్తివంచన లేకుండా కష్టపడతానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గురువారం గుడివాడలో తుమ్మల సీతారామపురం మున్సిపల్ పార్క్‌లో అన్న క్యాంటీన్ పునః ప్రారంభించి, పేదలకు ఆహార పదార్థాలు వడ్డించారు. వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారులతో కలసి ముఖ్యమంత్రి దంపతులు భోజనం చేస్తూ వారు చేస్తున్న వృత్తులు వ్యాపారాలు, వారి కుటుంబాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు గతంలో తాము అన్న క్యాంటీన్ వల్ల ఎలా ప్రయోజనం పొందామో ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ జన్మస్థలం, తొలిసారిగా ఎమ్మెల్యే అయిన గుడివాడ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటుందన్నారు. వచ్చే జనవరిలో జన్మభూమి 2.0 ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మళ్లీ గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ, మెరుగైన సేవలు అందిస్తామన్నారు. దేశంలో ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా, ప్రపంచంలో తెలుగుజాతిని నెంబర్ వన్ జాతిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు దాతృత్వం కలిగి ఉండాలని, వ్యాపార వర్గాలు తమకు వచ్చిన లాభాలలో కనీసం 5 శాతం దాతృత్వానికి వ్యయం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి, గుడివాడ, అవనిగడ్డ, పెడన, పామర్రు, పెనమలూరు, గన్నవరం శాసనసభ్యులు వెనిగండ్ల రాము, మండలి బుద్ధ ప్రసాద్, కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావులు అందరూ కలిసి అన్న క్యాంటీన్లకు 50 లక్షల రూ.లు విరాళం అందజేస్తామన్నారని ముఖ్యమంత్రి ప్రకటించి, వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే దండమూడి చౌదరి 5,07,779/-విరాళం అందజేసి ప్రతి ఏడాది ఇదే మొత్తం విరాళంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కోటి రూపాయలు చొప్పున విరాళం అందజేసిన శ్రీనివాసరాజు, నారా భువనేశ్వరిని ముఖ్యమంత్రి చంద్రబాబు శాలువ, మెమెంటోలతో సత్కరించారు.
పేదలు, చిరువ్యాపారులతో సీఎం మాటామంతీ
తొలుత ముఖ్యమంత్రి వివిధ వృత్తులు చిరు వ్యాపారాలు చేసుకుంటున్న పేదలతో మాట్లాడి అన్న క్యాంటీన్ల వల్ల ఉపయోగం ఏమిటి అని ప్రశ్నించగా, గతంలో అన్న క్యాంటీన్ల వల్ల వారు పొందిన ప్రయోజనాలు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వారి జీవన పరిస్థితులు కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
వలివర్తిపాడుకు చెందిన రేమల్లి రజనీకాంత్ అనే ఆటో డ్రైవర్ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం పొంది ఆటో ఓనర్ అయ్యానని తెలుపగా డీజిల్ ఆటోకు ఎంత వ్యయం అవుతుంది, ఎంత ఆదాయం వస్తుందో ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. డీజిల్ ఆటోను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకుంటే ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని, నీ వాహనంతోనే ఈ విధానం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఈ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. రజినీకాంత్‌ను నీ పిల్లలు ఏం చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించగా, ఆటో తోలి మా అబ్బాయిని బీటెక్ చదివించానని, ఇప్పుడు అతను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని, చెల్లికి ఫీజు కట్టి బీడీఎస్ డాక్టర్ కోర్స్ చదివిస్తున్నాడని రజనీకాంత్ తెలుపగా, ముఖ్యమంత్రి అతని కొడుకు రవితేజను మనస్ఫూర్తిగా అభినందించారు.
తమ్మిశెట్టి నాగమణి అనే మహిళ సమీప గ్రామాలకు ఆటోల్లో వెళ్లి గిల్టు నగలు విక్రయించి జీవనం సాగిస్తున్నట్లు తెలుపగా, ఆటోలకు చాలా వ్యయం అవుతుంది, మోపెడ్ ఇస్తే నేర్చుకుంటావా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించి, ఈమెకు ఇంట్లోనే చార్జింగ్ చేసుకునే ఎలక్ట్రిక్ టూవీలర్ అందించాలని కలెక్టర్ ను ఆదేశించారు. అంగడిలో పనిచేస్తూ ముగ్గురు ఆడపిల్లలను చదివించుకుంటున్న వాసంశెట్టి విజయలక్ష్మికి, చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదిశేషుకు కూడా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆర్థిక సహాయం అందించి, మెరుగైన ఉపాధి పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్న క్యాంటీన్ పున: ప్రారంభం గొప్ప కార్యక్రమమని అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, డైరెక్టర్ హరి నారాయణన్, సీఎంఓ కార్యదర్శి ప్రద్యుమ్న , హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ సీఈవో కౌంతేయ దాస, పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగ నరసింహారావు, గుడివాడ ఆర్టీవో పద్మావతి, మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు