- జీవితకాలం ఉపయోగపడేలా స్కిల్ సెన్సస్ డేటా ఉండాలి
- మంగళగిరి అనుభవాలతో మరింత అర్థవంతంగా సేకరణ
- అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు
- స్కిల్ డెవలప్‌మెంట్‌పై అధికారులతో మంత్రి సమీక్ష
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అధికారులను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టనున్న స్కిల్ సెన్సస్ విధివిధానాలపై స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ అధికారులతో మంత్రి లోకేష్ శుక్రవారం ఉండవల్లి నివాసంలో సమీక్షించారు. మంగళగిరిలో చేపట్టిన నైపుణ్యగణన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని మరింత అర్థవంతంగా, సులభతరంగా రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ చేపట్టాలని సూచించారు. స్కిల్ సెన్సస్ ద్వారా సేకరించిన డేటా యువతకు జీవితకాలం ఉపయోగపడేలా ఉండాలన్నారు. ఆర్గనైజ్డ్ సెక్టార్లతోపాటు అన్ ఆర్గనైజ్డ్ స్కిల్ డేటాను కూడా సేకరించాలన్నారు. స్కిల్డ్ వర్కర్లకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో తాము సొంత నిధులతో శిక్షణ ఇస్తూ ఉద్యోగావకాశాలు సైతం కల్పిస్తున్నామని, ఆ మోడల్‌ను నమూనాగా తీసుకొని ఓం క్యాప్ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
కేవలం అరబ్ దేశాల్లో మాత్రమే కాకుండా యూరోపియన్, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో స్కిల్డ్ వర్కర్లకు డిమాండ్ ఉందని, ఆయా దేశాల్లో అవసరాన్ని బట్టి స్థానికంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించినట్లయితే సుమారు 2 లక్షల మంది వరకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని అన్నారు. ఇందుకోసం వివిధ ప్రభుత్వ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు జర్మన్, జపనీస్ వంటి భాషలను కూడా నేర్పించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అంతర్జాతీయస్థాయి డిమాండ్‌కు అనుగుణంగా యువతను తీర్చిదిద్దాలన్నారు. స్కిల్ సెన్సస్ పూర్తయ్యాక యువతను వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ తీసుకునేలా చైతన్యపర్చాలని తెలిపారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే స్కిల్ సెన్సస్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. స్కిల్ సెన్సస్ డేటా సమీకృతం చేసే సమయంలో సీడాప్, ఏపీఎస్‌ఎస్‌డీసీ, నాప్ డేటా డబ్లింగ్ కాకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు. సమావేశంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్‌మెంట్ ఎండీ గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.