- అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోండి
- అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశం
అమరావతి: వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శనివారం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గాని జరగకూడదన్నారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకోవాలని ఆదేశించారు. బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలు, గ్యాస్ తదితర సామాగ్రిని రెవెన్యూ అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. తీర ప్రాంతాలలో, లోతట్టు ప్రాంతాలలో తుఫాన్ రక్షిత భవనాలను సిద్ధం చేసుకుని అవసరమైన బోట్లను సిద్ధం చేస్తున్నామన్నారు. పాము కాటు,విష జ్వరాలు, డయేరియా వంటి వాటితో పాటు అన్ని రకాల మందులతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
పడవలు, వలలు ఇతర పనిముట్లు భద్రపరుచుకోవడంతో పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా మత్స్యశాఖను అప్రమత్తం చేశామన్నారు. ముంపు ప్రాంతాల్లో నెలలు నిండిన గర్భిణీ స్త్రీలను, దీర్ఘవ్యాధిగ్రస్తులను గుర్తించి దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఏటి గట్ల పటిష్టతకు ఇసుక బస్తాలు, సర్వే బాదులు సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.