- పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తాం
- కేంద్రం అనుమతించినా గత ప్రభుత్వం నిలిపేసింది
- అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి నారాయణ జవాబు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌలిక వసతుల కల్పన వచ్చే డిసెంబరు నెలాఖరుకు పూర్తి చేసేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మున్సిప ల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. టిడ్కో గృహాలపై అసెంబ్లీ లో టీడీపీ ఎమ్మెల్యేలు పి.జి.వి.ఆర్.నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, తెనాలి శ్రావణ్‌కుమార్, కొలికపూడి శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 2014-2019 మధ్య కాలంలో నిర్మించిన టిడ్కో గృహాల ప్రాంతాల వారీ వివరా లు, విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లు, మౌలిక వసతుల కల్పనపై సభ్యులు సభ్యులు వివరాలు అడిగారు. నారాయణ సమాధానమిస్తూ రాష్ట్రంలో 2014`2019 వరకూ నిరుపేదల కోసం టిడ్కో గృహాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రతి మహిళ తన కుటుంబంతో ఆనందంగా ఉండే ఇళ్లు కట్టాలని ఎంత ఖర్చ యినా పర్వాలేదని సీఎం చెప్పారన్నారు. అమరావతి రాజధాని కోసం దేశవిదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ పేదలకు ఇళ్లు ఎలా ఉన్నాయో అధ్యయనం చేసి ఇక్కడ ఇళ్లు కట్టినట్లు తెలిపారు.
దీంట్లో భాగంగా టిడ్కో ద్వారా మొత్తం 7,01,481 ఇళ్లను నిర్మించేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నట్లు సభకు వెల్లడిరచారు. వీటిలో 5 లక్షల ఇళ్లకు నాటి టీడీపీ ప్రభుత్వంలో పాలనాపరమైన అనుమతులు జారీ చేసినట్లు చెప్పారు. మొత్తం 5 లక్షల ఇళ్లకు 3,13,832 ఇళ్లకు టెండర్లు పిలవగా 77,371 ఇళ్లు పూర్తయినట్లు తెలిపా రు. మరొక 89,671 ఇళ్లు 75 శాతం, 49,329 ఇళ్లు 50 శాతం పూర్తి చేశామన్నారు. 2,16,370 ఇళ్లు 2019 ఏడాదిలోపే చాలా వరకూ పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వం 25 శాతం కూడా పూర్తి కాలేదనే సాకుతో కారణంతో 52,192 ఇళ్లను జాబితా నుంచి తొలగించినట్టు వివరించారు. మొత్తం 104 మున్సిపాలిటీల్లో 2,61,640 ఇళ్లు ప్రారంభించినట్లు చెప్పారు. ఇక విశాఖపట్నం పద్మనాభ నగర్‌లో 864 ఇళ్లకు టెండర్లు పిలిచి పూర్తిచేశామన్నారు. అచ్చినాయుడు లోవలో 4608 ఇళ్లు కేటాయించగా 3984 ఇళ్లకు టెండర్లు పిలిచి నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు. ములగాడలో 504 ఇళ్లు కేటాయించగా 336 ఇళ్లు నిర్మాణాలు పూర్తయినట్లు చెప్పారు. కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ మౌలిక వసతుల కల్పన పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులకు అందించలేదన్నారు. మొత్తంగా 3,13,832 ఇళ్లను డిసెంబరు నెలాఖరులోగా పూర్తి చేయ డానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు శాసనసభలో వివరించారు.