- రుణభారం తగ్గించే దిశగా కార్యాచరణ
- అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు
- ఆదాయం పెంపుపై దృష్టి సారించాలి
- అధికారులకు రవాణా మంత్రి మండిపల్లి ఆదేశం
అమరావతి (చైతన్యరథం): గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చేతులు దులుపుకుందని, విలీనానంతర సమస్యలను పట్టించుకోలేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆక్షేపించారు. విలీనానంతర సమస్యల పరిష్కరానికి కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు. సిబ్బంది, సంస్థ నిర్వహణలో సరైన విధివిధానాలు అవలంబించాలని సూచించారు. అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయాలని, ఆర్టీసీపై రుణభారం తగ్గించే దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు. మంగళవారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. టిక్కెట్ (కోర్) రాబడి, నాన్-టిక్కెట్ (నాన్-కోర్) ఆదాయాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (బీవోటీ) విధానంలో, ఇతర వాణిజ్య ప్రాజెక్టుల కోసం ఉపయోగించాల్సిన భూముల వివరాలపై చర్చించారు.
ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన వాణిజ్య ప్రతిపాదనలు/అభివృద్ధి పనుల వివరాలు, వాటపై ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళికల పైన వివరాలు తెలుసుకున్నారు. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు, స్క్రాపింగ్ కోసం గుర్తించిన పాత బస్సుల వేలం విధానంలోని నిబంధనలపై చర్చించారు. అద్దె బస్సుల ఆదాయం మెరుగుపరచడం, సర్వీసుల పెంపుదల, కొత్త అద్దె బస్సులు ప్రవేశ పెట్టే అంశాలపై సమీక్షించారు. అసోసియేషన్ల ద్వారా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, ఏపీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్ పాల్గొన్నారు.