- పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అనుసంధానం ముఖ్యం
- మంత్రులు, ఎంపీలు వారంలో ఒక రోజు పార్టీ ఆఫీసుకు వెళ్లాలి
- ప్రజలకు, కార్యకర్తలకు అండగా నిలవాలి
- టీడీపీపీ సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): ఐదేళ్ల తరువాత 2029లో కూడా పార్టీ గెలవడానికి మనం ఇప్పటి నుంచే అడుగులు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉండవల్లి నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అవసరం అయిన మంచి పనులు చేసుకుంటూ పోవాలి.. ప్రజలకు మంచి చేసే విషయంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదని సూచించారు. పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలి. వారంలో ప్రతి మంత్రి, ఎంపీ ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలి. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. జిల్లాలకు వెళ్లినప్పుడు కూడా మంత్రులు తప్పకుండా అక్కడి పార్టీ కార్యాలయానికి వెళ్లాలి. ఎన్డీఎ నేతలతో సమావేశమవ్వాలి.
కార్యకర్తలకు అండగా నిలవాలి..వారికి తగు సాయం చేయాలి. నేను అందుకే 1995 పాలన అని మళ్లీ చెపుతున్నాను. రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఉండాలి. దాన్ని 1995లో అమలు చేశాం. మళ్లీ ఆ విధానం అమల్లో ఉండాలి. పబ్లిక్ పాలసీలతో దేశ గమనం మార్చవచ్చు. ప్రజల తలరాతలు మార్చవచ్చు అని నాడు చేసి చూపించాం. అమెరికాలో అమెరికన్స్ 65,900 డాలర్ల తలసరి ఆదాయం పొందుతుంటే…. భారతీయులు 1.19 లక్షల డాలర్ల తలసరి ఆదాయం పొందుతున్నారు. పాలసీలు ఇచ్చే ఫలితాలకు ఇదొక ఉదాహరణ. విభజన కష్టాలు అధిగమించి మనం ముందుకు పోతున్న సమయంలో 2019లో జగన్ వచ్చి రాష్ట్రాన్ని 20 నుంచి 30 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లాడు.
రాష్ట్రంలో నేడు ప్రభుత్వ అత్యవసర ఖర్చులకూ నిధులు లేవు…అప్పుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లు పెట్టాడు. ఉద్యోగుల పిఎఫ్ వంటి సొమ్మునూ ఇతర విభాగాలకు తరలించాడు. వాళ్లు దాచుకున్న సొమ్మును లాగేశారు. రాష్ట్రంలో 1.75 లక్షల ఎకరాల భూమిని కొట్టేశారు. 5 ఏళ్లలో రూ.40 వేల కోట్ల విలువైన భూములు మింగేశారు. మద్యం పాలసీని మార్చి డిస్టలరీలు అన్నీ హస్తగతం చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం, జగన్ చేసిన పనులు చూస్తుంటే తీవ్ర వాదులు, ఉగ్రవాదులే కొంచెం నయమనిపించేలా ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు.