ఒంగోలు (చైతన్యరథం): మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం నాడు ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని స్వయం సహాయక బృందాల సభ్యులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన వడ్డీ లేని రుణాల చెక్కులు మంత్రులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్వయం సహాయక బృందాల సభ్యులకు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా త్వరలో స్వయం ఉపాధికి రుణాలు ఇవ్వబోతున్నాం. మహిళలకు 50 శాతం సబ్సిడీతో ఈ-ఆటోలు ఇస్తున్నాం, ఈ ఆటోలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటు ట్రాక్టర్లు కూడా ఇస్తాం. గ్రామాలలో పాడిపరిశ్రమను పెంచేందుకు సబ్సిడీతో పాడి ఆవులు, గేదెలు ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతి కల్పిస్తున్నాం. హాస్టల్ విద్యార్థులకు బట్టల సబ్బులు, స్నానపు సబ్బులు, షాంపులు, పౌడరు, దువ్వెనతో కూడిన కిట్లు ఇవ్వబోతున్నాం. హాస్టళ్లల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి టాయిలెట్‌లు శుభ్రంగా ఉంచని హాస్టల్ వార్డెన్లకు జరిమానాలు విధించాం. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కొండపి నియోజకవర్గంలోనే రూ. 25 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశాం. రోడ్లు లేని గ్రామాలలో రోడ్లు వేస్తున్నాం. ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లతో పాటు విద్యుత్ స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాతో పాటు, రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి డోలా కోరారు.