టిడిపి అధికారంలోకి రాగానే చేనేతలకు ముడిసరుకు సబ్సిడీ, సబ్సిడీరుణాలను అందజేసి ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు చంద్రన్న బీమాతో తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం ధర్మావరం నియోజకవర్గం ఇందిరమ్మ కాలనీలో చేనేత కార్మికులను లోకేష్ కలుసుకొని వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. వారి సమస్యలపై లోకేష్ స్పందిస్తూ టిడిపి హయాంలో చేనేత కార్మికులకు రూ.110 కోట్ల మేర రుణమాఫీ చేశామని చెప్పారు.
చేనేత కార్మికులకు ముడిసరుకు పై సబ్సిడీ, రుణాలు అందజేసి అండగా నిలిచామన్నారు. ఆదరణ పధకంలో చేనేత కార్మికులకు 90 శాతం సబ్సిడీపై పనిముట్లు అందచేసినట్టు వివరించారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికులకు పరిహారం ఇవ్వకపోగా, కనీసం వారి కుటుంబాలను పరామర్శించేందుకు సైతం సిఎం కు మనసు రావటం లేదని విమర్శించారు. రాష్ట్రంలో సిఎం జగన్ అసమర్ధత చేనేత కార్మికులకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు.