- రానున్న రోజుల్లో చేనేతలను ఆధునికీకరిస్తాం
- రైతులకు 48 గంటల్లోనే ధాన్యం డబ్బు చెల్లింపు
- రేషన్ పంపిణీలో అక్రమాలను అరికడతాం
- క్షేత్రస్థాయికి వెళ్లే అంగన్వాడీ సూపర్‌వైజర్లకు టీఏలు
- కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): బీసీల్లో వారసత్వంగా వచ్చే వృత్తులను ప్రోత్సహించడానికి గతంలో ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించామని, గత ప్రభుత్వం లబ్ధిదా రులకు పనిముట్లు అందించలేదని, అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు చిత్తూరు, అల్లూరి సీతారామరాజు మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో నిలిపివేసిన పనిముట్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 2014-19 మధ్య పలు చోట్ల బీసీ భవనాలు నిర్మించతలపెట్టామని, వాటిని కూడా గత ప్రభుత్వం పూర్తి చేయ లేదని, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారి టీలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
బీసీలకు వారసత్వంగా కొన్ని వృత్తులు ఉన్నాయని, గౌడ, ఈడిగ సామాజిక వర్గం వారు కల్లు విక్రయిస్తారని, వారికి 15 నుంచి 20 శాతం వరకు షాపులు కేటాయించగలిగితే ఆర్థికంగా బలపడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం చేనేత వస్త్రాలకు మళ్లీ ప్రాధాన్యం వస్తోందని, ఆధునీకరణ జోడిస్తే ఆర్థికంగా ఆయా వర్గాలను ఏ విధంగా పైకి తీసు కురావచ్చో కలెక్టర్లు, సంబంధిత అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఫ్యామిలీ, విలేజ్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లించాలని, నాణ్యమైన గోతాలు ఇవ్వాలని ఆదేశించారు.
రేషన్ షాపుల్లో ప్రజల నచ్చిన విధంగా మాత్రమే రాగులు, సజ్జలు, ఇతర మిల్లెట్స్ విక్రయించాలని సూచించారు. కాకినాడలో ఒకే ఫ్యామిలీలో సివిల్ సప్లై శాఖలో ఎమ్మెల్యే, రైస్ మిల్లర్ల అసోసియేషన్, సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నారని, దీంతో దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్లు చేశారని, ఇలాంటి వాటిని ఇక నియంత్రించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్స్ ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయికి వెళ్లే అంగన్వాడీ సూపర్‌వైజర్లకు టీఏలు చెల్లిస్తామని వివరించారు.