అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు దుర్భరమైన స్థితిలో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తంచేశారు. నెల్లూరు జిల్లా కావలిలో దళితుడు దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపికి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. బలహీన వర్గాలు, దళితులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. కావలిలో కరుణాకర్ ఆత్మహత్య రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనం. కరుణాకర్ ముసునూరులోని రెండు చేపల చెరువులను సబ్ లీజుకు తీసుకుని భారీగా పెట్టుబడి పెట్టారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సురేష్‌రెడ్డి చెరువుల్లో చేపలు పట్టకుండా అడ్డంకులు సృష్టించి కరుణాకర్ ను వేధించారు. వైసిపి నేతల వేధింపులకు తాళలేక కరుణాకర్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుల్లో ఒకరైన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శ్రీశైలం దేవస్థానం బోర్డులో పదవిలో కూడా ఉన్నారు. దళితులపై దాడుల ఘటనల్లో ఈ మూడేళ్లలో కఠిన చర్యలు లేకపోవడం వల్లనే నిందితులు బరితెగిస్తున్నారు. పోలీసుల సరైన, తక్షణ చర్యల ద్వారా మాత్రమే దళితులకు రక్షణ దొరుకుతుంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు డీజీపీకి రాసిన లేఖలో విజ్జప్తిచేశారు. రాష్ట్రంలో గత మూడేళ్లుగా దళితులపై యధేచ్చగా దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే డీజీపీ జోక్యం చేసుకోవాలని కోరారు.