అమరావతి: సమస్యలను పరిష్కరించలేని దద్దమ్మ ప్రభుత్వం.. సమస్యలపై నిలదీసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం దారుణమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. అనంతపురంలో ‘‘సేవ్ ఏపీ పోలీస్’’ అంటూ అమరవీరుల స్మారక స్థూపం దగ్గర నిరసనకు దిగిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ను సర్వీసు నుంచి తొలగించడంపై చంద్రబాబునాయుడు స్పందిస్తూ.. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ చేసిన తప్పేంటి? పోలీసు శాఖలో ఉండే సమస్యలను పరిష్కరించమని జగన్ రెడ్డి దృష్టికి తేవాలనుకోవడం తప్పా? జగన్ రెడ్డి మాట మీద ఒక పోలీసు పైనే అక్రమకేసులు పెట్టారంటే, వైసీపీ నేతల మాటలు విని సామాన్యులను ఎంత వేధిస్తున్నారో అర్థం అవుతోంది. ప్రకాష్ పై ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును తీవ్రంగా ఖండిస్తూ ప్రకాష్ పై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకొని అతనిని వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. అప్పటివరకు ప్రకాష్ కు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
కానిస్టేబుల్ ప్రకాష్ పోరాటం స్పూర్తినిచ్చింది
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్‌కి హాట్సాఫ్.. నిరంకుశ ప్రభుత్వం పై మీ పోరాటం స్ఫూర్తినిచ్చిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. సేవ్ ఏపీ పోలీస్ అంటూ సీఎం జగన్ రెడ్డి గారిని ప్రశ్నించే హక్కు ఒక దళిత కానిస్టేబుల్ కి లేదా? అదే నిరసన మీ సొంత సామాజిక వర్గం వారి నుండి వస్తే వేటు వేసేవారా జగన్ రెడ్డీ? రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దమనకాండకు ప్రకాష్ ఉదంతం ఒక తాజా ఉదాహరణ. పోలీసులకు రావాల్సిన బకాయిల గురించి ప్రశ్నిస్తే లేని కేసుని తెరపైకి తెచ్చి వేటు వేసారు. తక్షణమే ఆయన్ని సర్వీసులోకి తీసుకోవాలి. పోలీసులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు పెండిరగ్ పెట్టిన బకాయిలు అన్ని విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.