- భాష ఔన్నత్యాన్ని భావితరాలకు తెలియజేయాలి
- ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో మండలి బుద్ధప్రసాద్
విజయవాడ (చైతన్యరథం): తెలుగు భాష, తెలుగు జాతి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత కవులు, రచయితలపై ఉందని 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గౌరవాధ్యక్షుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో రెండురోజుల పాటు నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఆదివారం వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ చెన్నైలో ఇటీవల ఓ సినీనటి మాట్లాడుతూ.. తమిళనాడుకు తెలుగువారు పరిచారకులు (సేవకులు)గా వచ్చారని చెప్పారు.. అది వాస్తవం కాదు.. తమిళనాడును మొదట పాలించింది తెలుగువారేనని స్పష్టం చేశారు. ఆ తర్వాతే తమిళులు పాలించారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి అత్యధిక సంఖ్యలో ముఖ్యమంత్రులుగా పనిచేసింది కూడా తెలుగువారే. శ్రీకృష్ణ దేవరాయలు, రాణి మంగమ్మ, నాయకరాజులు తెలుగులోనే పరిపాలన చేశారు. తమిళనాట తెలుగు ఓ వెలుగు వెలిగింది తప్ప.. దాస్య ప్రవృత్తితో తెలుగువారు అక్కడ లేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించేందుకు తమిళులెవరూ ముందుకు రాలేదు. సైమన్ కమిషన్ వస్తే తుపాకీ గుండుకు ఎదురుగా గుండె చూపిన వ్యక్తి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు.
ఉప్పు సత్యాగ్రహానికి మహాత్మాగాంధీ పిలుపునిస్తే.. కాశీనాథుని నాగేశ్వరరావు, ప్రకాశం పంతులు, దుర్గాబాయమ్మ నాయకత్వం వహించారు. మద్రాసు నగరంలో ఏ కార్యక్రమాన్నయినా విజయవంతంగా నడిపించిన ఘనత తెలుగువారిది. మనలో భాషాభిమానం, జాతీయాభిమానం తగ్గింది. ఫలితంగా తమిళనాడులో ఉన్న తెలుగువారు.. తెలుగువారని నమోదు చేసుకోకపోవటంతో రెండో స్థానంలో ఉన్న తెలుగు భాష నాలుగో స్థానానికి పడిపోయింది. త్వరలో జరగబోయే జనగణనలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి తెలుగు వ్యక్తి.. తెలుగువారుగా నమోదు చేసుకోవడం ద్వారా తెలుగు భాషను మళ్లీ రెండో స్థానానికి తీసుకెళ్లాలి. మహాసభలకు విచ్చేసిన కవులు, రచయితలు తెలుగు భాషను, తెలుగు జాతిని ముందుకు తీసుకెళ్లేందుకు యోధులుగా మారాలని బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు.
తెలుగులో ప్రభుత్వ ఆదేశాలు: మంత్రి సత్యకుమార్
అధికారుల కోసం కూడా తెలుగు భాషపై సదస్సు నిర్వహించాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. ప్రభుత్వ శాఖల్లో ఆదేశాలు తెలుగులో వచ్చేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు భాష ఔన్నత్యం గురించి అందరూ తెలుసుకోవాలన్నారు విజయవాడలో జరుగుతున్న 6వ ప్రపంచ తెలుగు మహా సభల్లో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ… గొప్ప వారి ముందు కూర్చున్నప్పుడు తనలో ఆత్మనూన్యతాభావన వస్తుందని.. వారి ద్వారా తాను ఎన్నో విషయాలు తెలుసుకుని.. ఆచరిస్తానని చెప్పారు. ఆంగ్లం మాట్లాడితే తాము చాలా గొప్ప అనే భావన చాలా మందిలో ఉందని.. కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అన్న రాజులెందరో ఉన్నారని గుర్తుచేశారు. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న పేర్లను ప్రస్తావించకుండా తెలుగు భాష గురించి మాట్లాడలేమని అన్నారు. ఆ తర్వాత అనేక మంది మహానుభావులు తెలుగు భాష పరిరక్షణకు పాటుపడ్డారని ఉద్ఘాటించారు. రాజకీయంగా నేతల మధ్య సైద్ధాంతిక విబేధాలు ఉన్నా.. భాష కోసం అందరూ కలిసి నడవాలని సూచించారు. తెలుగు భాష కోసం చేపట్టిన యజ్ఞంలో తాను కూడా భాగస్వామిగా నడుస్తానని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.