1983 జనవరి 9. తెలుగు కీర్తి దిగ్దిశాంతాలు దాటిన రోజు. రాజకీయం ఏసీ గదులు దాటి గుడిసెకు చేరిన రోజు. పేదవాడికి అన్నం రుచి తెలిసిన రోజు. దేశంలో సరికొత్త రాజకీయం మొదలైన రోజు. నాటి ఢల్లీి పాలకులకు తెలుగువాడి వాడి, వేడి తెలిసిన రోజు. తెలుగు జాతికి పండుగ రోజు. తెలుగు నేల పులకించిన రోజు. రాష్ట్రంలో 35 ఏళ్ల పాటు ఏకబిగిన పాలించిన పార్టీ అహంకారానికి చరమగీతం పాడిన రోజు. సరికొత్త ఆంధ్రావనికి నాంది పలికిన రోజు. నందమూరి తారకరాముడు తెలుగుదేశాధీశుడిగా పట్టాభిషిక్తుడైన రోజు.
రామారావు ప్రజల మనిషి. రాజభవన్ గోడలు ఆయనకు ఇరుకుగా అనిపించాయి. అందుకే తాను లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని కోరుకున్నారు. రాష్ట్ర చరిత్రలో అంతకు ముందు ఎవ్వరూ రాజ్‌భవన్ బయట ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయలేదు. 1983, జనవరి 9 వ తేదీన లాల్ బహదూర్ స్టేడియం రికార్డు సంఖ్యలో రెండున్నర లక్షల మంది జనంతో కిటకిటలాడిరది. చాలామంది లోపలికి వెళ్లలేక బయటే ఆగిపోయారు.ఆ చారిత్రక సన్నివేశాన్ని స్వయంగా చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచీ లారీల్లో, రైళ్ళలో, బస్సుల్లో జనాలు తరలివచ్చారు. హైదరాబాద్ నగరమంతా పండుగ వాతావరణం అలముకుంది.
ఆ రోజు జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. గాంధేయవాది అయిన కేసీ అబ్రహాం జనతా పార్టీ అధికారంలో ఉండగా ఆంధ్ర రాష్ట్రానికి గవర్నరుగా వచ్చారు. అంతకు ముందు పనిచేసిన రాష్ట్ర గవర్నర్లందరూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వచ్చినవారే. అలాంటి అబ్రహాం రాష్ట్రానికి తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రి గా రామారావు తో పదవీస్వీకార ప్రమాణం చేయించారు. రామారావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ప్రజలను ఉద్దేశించి చేసిన అరగంట ప్రసంగంలో రామారావు తాను మ్యానిఫెస్టోలో చేసిన ప్రతి వాగ్దానాన్నీ పూర్తి చేస్తానన్నారు. ప్రజలకు సేవ చేయాలనేదే జీవితంలో తన ఏకైక కోరిక అని ఆయన నొక్కి చెప్పారు.
రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన దైనందిక జీవనశైలిలో మార్పులేదు. విశ్రాంతికి అవకాశమే లేదు. ప్రజాసంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయనకు అధికారం అంటే విలాసం కాదు, బాధ్యత. క్రమశిక్షణ, క్రమవర్తన, సమయపాలన ఆయన జీవితసూత్రాలు. అవి ఆయన రాజకీయ జీవితంలో కూడా భాగమయ్యాయి.
ముఖ్యమంత్రిగా జీతము తీసుకోనని రామారావు చెప్పారు.కానీ ప్రభుత్వ నిబంధనలు దానికి ఒప్పుకోవు. అందుకని నెలకు ఒక రూపాయి గౌరవ వేతనంగా తీసుకొనేందుకు అంగీకరించారు. వైభవోపేతమైన ముఖ్యమంత్రి నివాసానికి మారడానికి ఆయన అంగీకరించలేదు. తన అబిడ్స్ ఇల్లు తనకు చాలన్నారు. ఖరీదైన విలాసమంతమైన కార్లను వద్దన్నారు. అంబాసిడర్ కారు చాలన్నారు. ముఖ్యమంత్రి హోదాకు అనుబంధంగా వచ్చే ఎన్నో విలాసాలను సౌకర్యాలను ఆయన స్వచ్ఛందంగా వదులుకున్నారు.