- నేటి సదస్సు రాష్ట్రాభివృద్ధికి నాంది
- త్వరలో ‘పేదల సేవలో‘ మమేకం..
- అక్టోబర్ 2న విజన్ డ్యాక్యుమెంట్ విడుదల
- జిల్లాస్థాయిలో ‘విజన్’ సిద్ధం చేయండి
- క్షేత్రస్థాయికి వెళ్తేనే మార్పు సాధ్యం
- మంత్రులు, ఎమ్మెల్యేల ఆలోచనల అమలు
- 100 రోజుల్లో మార్పు చూపడమే లక్ష్యం
- జిల్లా కలెక్టర్ల సదస్సుల్లో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ‘మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది. మనమంతా కష్టపడితే 2047నాటికి ప్రపంచంలోనే మనం నంబర్ వన్‌గా ఉంటాం. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతోంది. ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారు. విధ్వంసంతోపాటు పనిచేసే అధికారులను పక్కనబెట్టారు.. బ్లాక్ మెయిల్ చేశారు. బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగింది. ఒకప్పుడు ఆంధ్రా అధికారులంటే ఢల్లీిలో గౌరవం ఉండేది. ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ప్రతి నెలా ఒకటో తేదీన ‘పేదల సేవలో’..
పేదరిక నిర్మూలనకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో అధికారులు పాల్గొని ప్రజలతో మమేం కావాలని దిశానిర్దేశం చేశారు. పేదరిక నిర్మూలనకు వినూత్న ఆలోచనలతో కలెక్టర్లు ముందుకు రావాలన్నారు. పార్టీ ఆఫీస్‌కి వెళ్లేటపుడు పెద్దఎత్తున ప్రజలనుంచి ఫిర్యాదులు అందుతున్నాయని.. 5వేల ఫిర్యాదుల్లో సగం భూసమస్యలే ఉన్నాయన్నారు. జగన్ పాలనలో పెద్దఎత్తున భూకబ్జాలు, అవకతవకలు జరిగాయన్నారు. సర్వే రాళ్లు, పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో వేసుకోవాలన్న దుర్మార్గపు ఆలోచన గతంలో చూశామని వివరించారు. వ్యవస్థలో ఏదైనా చిన్న తప్పు జరిగితే సరిచేయవచ్చు. మొత్తంగా విధ్వంసం జరిగిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే భారీ కసరత్తు తప్పదు, అహర్నిశలు కష్టపడాలన్నారు. మనం తీసుకునే నిర్ణయాలు భావితరాలకు ఉపయోగపడాలని అంటూ.. 2047కి ప్రపంచంలో భారత నెంబర్ 1 ఎకానమీగా ఉంటుందని, 2029లో 3వ లార్జెస్ట్ ఎకానమీకి రాష్ట్రం చేరుకోవాలన్నారు. రాష్ట్రానికి హిస్టారికల్ అడ్వాంటేజెస్ ఉన్నాయని వివరిస్తూ.. గతంలో తొమ్మిదేళ్లలో బెస్ట్ ఎకో సిస్టం తెచ్చామన్నారు. అనంతరం వచ్చిన పాలకులు దాన్ని విధ్వంసం చేయలేదు కాబట్టే అభివృద్ధి కొనసాగింది. కానీ ఏపీలో అలా చేయకపోవడం వల్ల రాష్ట్రం వెనక్కి పోయిందన్నారు.
జవాబుదారీగా పనిచేయాలి..
ప్రజలకిచ్చిన మాటమేరకు రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలంటే ఆర్థిక ఇబ్బందులున్నాయి. కాని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ దిశానిర్దేశం చేసేది కాబోతోంది. గత పాలకులు ఐదేళ్లలో ఒక్క కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టలేదంటే పరిపాలన తీరును అర్థం చేసుకోవచ్చు. రాబోయే కాలంలో మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టుకుందామని సీఎం చంద్రబాబు వివరించారు. అధికారులు జవాబువాదారీతనంతో పనిచేయాలని, కొన్ని కీలక శాఖలు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. అభివృద్ధితోనే ఆదాయం, ఆదాయం వస్తేనే ప్రజలకు ఖర్చు చేయగలుగుతాం. అభివృద్ధితోనే ప్రజలకు సంతృప్తి ఉంటుంది. మెరుగైన పాలన అందించడం మా బాధ్యత.. దానికి మేం కట్టుబడి ఉంటామని అన్నారు.
పనిచేస్తే ప్రోత్సహిస్తాం
కలెక్టర్‌గా పనిచేయడం పెద్ద డ్రీమ్ అంటూనే.. పనిచేస్తే అధికారులను ప్రోత్సహిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారులు మానవతాదృక్పథంతో పనిచేయాలన్నారు. మంచి పరిపాలనతో ప్రజలకు మెరుగైన పాలన, జీవన ప్రమాణాలు అందించాలన్నారు. గతంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ (పీ3)తో భిన్నంగా ముందుకువెళ్లామని, ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్‌నర్‌షిప్ (పీ4) మోడల్‌తో మరింత వినూత్నంగా ముందుకెళ్దామన్నారు. జీరో పావర్టీ అనేది ప్రభుత్వ లక్ష్యంగా వివరిస్తూ.. ఈజ్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ రావాలని సూచించారు. ప్రజల జీవనప్రమాణాలు మెరుగయ్యేలా పని చేయాలని కలెక్టర్లకు సూచిస్తూనే.. మానవతా ధృక్ఫథంతో ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, అలాంటి ఆలోచనకు అధికారులు శ్రీకారం చుట్టాలన్నారు. ప్రభుత్వంలో ఎవరూ పెత్తందారి వ్యవస్థలా ప్రవర్తించకూడదని, అసహ్యంగా మాట్లాడటం, అనవసరంగా దూషించడంలాటి విధానాలు వద్దని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు వాస్తవాన్ని మీ దృష్టికి తెచ్చినపుడు సంబంధిత సమస్యలు పరిష్కరించాలన్నారు. సింపుల్ గవర్నెన్స్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. త్వరలో గవర్నమెంట్‌కు ఒక యాప్ తెస్తామని, అప్పుడే రియల్ టైమ్‌లో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుందన్నారు. ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ సిద్ధం చేద్దామని పిలుపునిచ్చారు.
వికసిత ఆంధ్ర మన లక్ష్యం
వికసిత ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం కావాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. అక్టోబర్ 2న విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామన్నారు. కలెక్టర్లు డిస్ట్రిక్ విజన్ డాక్యుమెంట్ తయారుచేయాలని, సెప్టెంబర్ 20కి 100 రోజులు అవుతుందన్నారు. విజన్ 2020ని అప్పట్లో ఎగతాళి చేసినా, చేసి చూపించామన్నారు. అలాగే కొత్త విజన్‌ను ఆలోచించాలని కలెక్టర్లకు సూచించారు. సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నామని, ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు పెట్టబోతున్నామని అంటూ.. నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్‌ను ముందుగా పరిష్కరించాలన్నారు.
1995నాటి చంద్రబాబును చూస్తారు
త్వరలోనే మళ్లీ 1995నాటి చంద్రబాబును చూస్తారని సీఎం హృద్యంగా ప్రకటించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని, తద్వారానే మంచి మార్పు సాధ్యమన్నారు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మీ ద్వారా పనులు చేయించాలి. అంగన్ వాడీకి వెళ్తా, డ్రైయిన్‌కు వెళ్తా.. అధికారులు ప్రజల కనీస అవసరాలను గుర్తించాలి. గ్యాస్, స్ట్రీట్ లైట్లు, రోడ్లు, సిమెంట్ రోడ్లు, వేస్ట్ మేనేజ్‌మెంట్ తదితర సమస్యలు గుర్తించి పరిష్కరించాలని సూచించారు. టూరిజానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూనే.. ఎంత పెట్టుబడులు పెట్టారన్నది కాదు, ఎంతమందికి ఉపాధి కల్పించామన్నది ముఖ్యమన్నారు. మంచిగా ఆలోచిస్తే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, రాష్ట్రంలో నదుల అనుసంధానం జరిగి ప్రతి ఎకరాకూ నీళ్లు అందించాలన్నారు. తద్వారా ఆర్థిక పరిపుష్టి జరుగుతుందని వివరించారు. ఇన్నోవేటివ్‌గా పనిచేయగలగాలి. ‘వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్, థింక్ గ్లోబల్లీ’ ఇది మన నినాదం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు.