- ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ మోదం..
- పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పాలసీల రూపకల్పన
- అదే బాటలో ఏపీ డేటా సెంటర్ 4.0
- సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0
- ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) బిల్లు ముసాయిదాకు ఓకే
- 8352 చ.కి.మీమేర సీఆర్డీఏ పునరుద్ధరణకు గ్రీన్‌సిగ్నల్
- జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయస్సు 61కి పెంపు
- కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పునరుద్ధరణ
- పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు
- కేబినెట్ నిర్ణయాలు వెల్లడిరచిన మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి (చైతన్య రథం): మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల సెక్టార్ లక్ష్య సాధనకు వీలుగా ఏపీ డ్రోన్ పాలసీ 4.0కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. డ్రోన్ వినియోగాభిరుచిని పెంచేలా.. అత్యవసర, ఇతర సేవలను వేగవంతం చేసేలా రాష్ట్ర డ్రోన్ కార్పొరేషన్ రూపొందించిన పాలసీకి మంత్రిమండలి ఓకే చెప్పింది. రాష్ట్రాన్ని డ్రోన్ హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తుండటం తెలిసిందే. అందులో భాగంగా కర్నూలులో డ్రోన్ డెవల్‌పమెంట్ సెంటర్ ఏర్పాటుకూ కేబినెట్ నిర్ణయించింది. ప్లగ్ అండ్ ప్లే విధానంలో డ్రోన్ డెవల్‌పమెంట్, ట్రైనింగ్, తయారీ కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తారు. ఈ పాలసీతో రాష్ట్రంలో వందకుపైగా డ్రోన్ తయారీ కంపెనీలు ఏర్పాటవుతాయని, దాదాపు 20 డ్రోన్ పైలట్ శిక్షణ కేంద్రాలు, 50 నైపుణ్యాభివృద్ధి సంస్థలను స్థాపించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డ్రోన్ సెక్టార్‌లో రూ.1,000 కోట్ల పెట్టుబడులు, రూ.3,000 కోట్ల రాబడి వస్తుందన్నది ప్రభుత్వ అంచనా. డ్రోన్ పాలసీతో ప్రత్యక్షంగా 15 వేలమందికి, పరోక్షంగా 25 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఐదో ఈ-క్యాబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలను విస్తృతంగా చర్చించిన కేబినెట్.. కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడిరచారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీ 4.0ని మంత్రిమండలి ఆమోదించింది. ఈ పాలసీ ద్వారా నియమితకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 200 మెగావాట్ల అదనపు డేటా సెంటర్ సామర్థ్యాన్ని చేర్చడమే లక్ష్యం. కృత్రిమ మేధస్సు సామర్థ్యాలతో కూడిన అధునాతన డేటా సెంటర్ల నుండి పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు పెద్దస్థాయి డేటా ఎంబసీలు మరియు డేటా సెంటర్ పార్కులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చడంపై దృష్టి సారించడం జరుగుతుందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడిరచారు. ప్రతిపాదిత డేటా సెంటర్ విధానం (4.0) 2024-29 ఆధునిక డేటా సెంటర్ల నుండి ఆర్థిక పెట్టుబడులను ఆశిస్తున్నట్టు వివరించారు.
ఇన్పర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ విభాగంలోనే ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ప్రభుత్వం తొలిసారి ఈ పాలసీని తీసుకొస్తోంది. 2024-29 మధ్యకాలంలో అమలయ్యేలా దీన్ని రూపొందించారు. కేంద్రం 50శాతం రాయితీని దశలవారీగా అందచేస్తుంది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 30 శాతం వరకూ పలు రకాల రాయితీలను అందిస్తుంది. అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించిన పలు సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఏర్పాటయ్యాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ను కూడా తీర్చిదిద్దేందుకు ఈ పాలసీ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి కొలుసు వివరించారు. ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులుపెట్టే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలిస్తోంది. దాదాపు 30 శాతం రాయితీలను రాష్ర ్టప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో.. చిప్‌లు, సెమీకండక్టర్ల తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఈ కొత్త విధనాన్ని తీసుకొచ్చింది. డ్రోన్ పాలసీ మరియు సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
ఏపీ ల్యాండ్ గాబింగ్ (నిషేధం) చట్టం -1982ని రద్దు చేస్తూ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) బిల్లు-2024 అమలుకు సంబంధించిన ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది. ల్యాండు గ్రాబింగుకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేలా ఈ చట్టాన్ని రూపొందించినట్టు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడిరచారు. 10 నుండి 14 ఏళ్లపాటు శిక్ష, గ్రాబ్ చేయబడిన ల్యాండ్ విలువతోపాటు నష్టపరిహారాన్నీ వసూలు చేసేలా నిబంధనలు పొందుపర్చారు. గుజరాత్, కర్ణాటలోని చట్టాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ ఈ చట్టాన్ని రూపొందించండం జరిగింది. ప్రభుత్వ భూముల రక్షణకు పదునైన చట్టం అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు కూటమి ప్రభుత్వం గుర్తించిందని మంత్రి కొలుసు పేర్కొన్నారు.
పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో 2014-19 మధ్యకాలంలో జరిగిన అభివృద్ధి పనులకు గత ప్రభుత్వం చెల్లింపులు చేయకపోగా.. వారిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించి ఆర్థికంగా, మానసికంగా వేధించడంతో వారందరూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో.. 4.45 లక్షల పనులకు సంబంధించి గుత్తేదారులకు రూ.331 కోట్లు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సదరు కాంట్రాక్టర్లకు 12 శాతం వడ్డీ కూడా ఇవ్వాలన్న విషయంపై ప్రభుత్వం పరిశీలన చేస్తోందన్నారు.
ఆర్థిక శాఖలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్) చట్టం -1984 పరిధిలోకి వచ్చే జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61 సంవత్సరాలకు 01.11.2024తేదీ నుండి పెంచడానికి సంబంధిత చట్టంలోని సెక్షన్ 3(1)ని సవరించడానికి రూపొందించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్నుచట్టం, 2017ను సవరిస్తూ.. 2024 ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే, ఏపీ ఎక్సైజ్ విభాగంలో రూపొందించిన మూడు ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలుపుతూ రాష్ట్ర శాసనసభ ముందుంచేందుకు అనుమతించింది.
నాసిరకం మద్యంతో గత ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే.. మా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన మద్యం విధానం అమలు చేయడం జరుగుతోందని మంత్రి పార్థసారథి వివరించారు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రధాన కేంద్రంగా కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పునరుద్ధరణకు రాష్ట్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికై పిఠాపురం ప్రధాన కేంద్రంగా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.