- చైర్మన్‌గా సీఎం చంద్రబాబు, కో చైర్మన్‌గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్
- చంద్రబాబుతో చంద్రశేఖరన్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ
- సీఐఐ ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి సమావేశం
- అమరావతిలో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం
- రాజధానిలో ఇంటర్నేషన్ లా స్కూలు ఏర్పాటుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో చర్చ
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి పెట్టుబడుల సాధనకు, వేగవంతమైన పారిశ్రామికాభివృద్ది సాధించేందుకు సీఎం చంద్రబాబునాయుడు ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థల ఏర్పాటుకు చంద్రబాబు చర్చలు జరిపారు. ఇందులో భాగంగా పారిశ్రామికాభివృద్దికి ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. స్వర్ణాధ్రప్రదేశ్ – విజన్ 2047 రూపకల్పనపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌లో దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, బిజినెస్ సెక్టార్ ప్రముఖులు, ఆయా రంగాల్లో నిపుణులు ఉండనున్నారు.
ఈ టాస్క్‌ఫోర్స్ కు ముఖ్యమంత్రి చైర్మన్‌గా, ప్రముఖ పారిశ్రామిక, వ్యాపార సంస్థ అయిన టాటా గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. శుక్రవారం సచివాలయంలో టాటా చైర్మన్‌తో భేటీ సందర్భంగా ఈ అంశంపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. ప్రత్యేకమైన విజన్ ద్వారా 2047 నాటికి ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విజన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనిలో భాగంగా పారిశ్రామికాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. ఇక పెట్టుబడులకు స్వర్గదామంగా, అన్ని సదుపాయాలున్న విశాఖ నగరంలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని టాటా చైర్మన్ ను సీఎం చంద్రబాబు కోరారు.
ఇక టాటా సంస్థల్లో భాగంగా ఉన్న ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ ను ఏపీలో కూడా తన కార్యాకలాపాలు విస్తరించేలా చూడాలని సీఎం కోరారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోన్న సోలార్ పవర్, టెలీకమ్యునికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపైనా టాటా గ్రూప్ చైర్మన్‌తో సీఎం చంద్రబాబు చర్చించారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయింది. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అధ్యక్షతన వచ్చిన ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు తాము తెస్తున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించారు.
అమరావతిలో సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఆన్ కాంపిటేటివ్ నెస్ సంస్థ ఏర్పాటుకు సీఐఐ ముందుకు వచ్చింది. అమరావతిలో ఈ సంస్థ ఏర్పాటుపై చర్చించారు. దీనిలో టాటా గ్రూప్ భాగస్వామి కానుంది. అనంతరం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సీఎంను కలిశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా, కౌన్సిల్ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతిలో ఇంటర్నేషన్ లా స్కూలు ఏర్పాటుపై సీఎంతో చర్చించారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. కాగా టాటా గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్‌తో సమావేశంపై సోషల్ మీడియా ఎక్స్‌లో సీఎం చంద్రబాబు స్పందించారు. అమరావతిలో ఇవాళ నా పాత స్నేహితుడు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సమావేశం గొప్పగా జరిగిందన్నారు.