- తీవ్ర అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్న మల్లికార్జునరెడ్డి
- సాయం అందించాలని ఎక్స్ ద్వారా పార్టీ నేతల విజ్ఞప్తి
- అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి లోకేష్ భరోసా
- లోకేష్ సూచనతో రంగంలోకి మంత్రి నారాయణ
అమరావతి (చైతన్యరథం): తీవ్ర అనారోగ్యానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీడీపీ కార్యకర్త, ఎన్టీఆర్ అభిమాని అయిన మల్లికార్జునరెడ్డికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. నెల్లూరు పట్టణానికి చెందిన కె.మల్లికార్జునరెడ్డి నారా లోకేష్ సేవా సమితి పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు అండగా నిలిచారు. ఎన్టీఆర్ అభిమాని అయిన మల్లికార్జున రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా ఉన్నారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఏడాది క్రితం పక్షవాతం కూడా రావడంతో పరిస్థితి విషమించింది. చికిత్స తీసుకుని కోలుకున్నారు. నెలక్రితం తిరిగి పక్షవాతం రావడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించారు. ఆపరేషన్ చేసి వైద్యులు ఒక కాలును తొలగించారు. మరోకాలు పక్షవాతానికి గురికావడంతో నడవలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నారు. మల్లికార్జునరెడ్డి దుస్థితిని పార్టీ నాయకులు ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ సూచనతో పురపాలక శాఖ మంత్రి నారాయణ వీడియో కాల్ ద్వారా మల్లికార్జునరెడ్డి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని, అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో స్వయంగా కలుస్తానని భరోసా ఇచ్చారు. సాయం కోరిన వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ కు మల్లికార్జునరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.