అయేషామీరా హత్యకేసులో సత్యంబాబు అనే దళితుణ్ణి అన్యాయంగా అరెస్ట్ చేసి, అతని జీవితాన్ని రాజశేఖరరెడ్డి సర్వనాశనం చేశారని, అదే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి దళితులే బలవుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కే.ఎస్.జవహర్ స్పష్టంచేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ విశాఖపట్నం విమానాశ్రయంలో అధికారం కోసం కోడికత్తి డ్రామా ఆడాడు. ఆరోజు జగన్‌కు అయిన గాయం ఎంతది.. ఆయన వేయించుకున్నకుట్లు ఎన్ని? అదేరోజున జగన్ మీడియాతో మాట్లాడుతూ, ‘‘జయలలితకు జరిగినట్టే తనకు జరుగుతోందనే అనుమానం కలుగుతోందని, ఏపీ ప్రభుత్వాన్ని, అక్కడి పోలీస్ వ్యవస్థను తానునమ్మడంలేదని’’ చెప్పుకొచ్చాడు.
కోడికత్తితో తనభుజానికి చిన్నగాయమైతే, ఆయన ఏపీలో చికిత్స తీసుకోకుండా నేరుగా హైదరాబాద్ వెళ్లి, అక్కడ న్యూరోసర్జన్ వద్ద గాయానికి కట్టు కట్టించుకున్నాడు. ప్లాన్ చేసి గాయం చేసుకోవడం తర్వాత ఎలా నటించాలనే ఆలోచన జగన్ ముందే చేశాడని అప్పుడే ప్రజలకు అర్థమైంది. జగన్ ఈరోజు కోడికత్తి ఘటనపై చిలుకపలుకులు పలుకుతున్నాడు. ఘటన జరిగిననాడు కుట్రకోణం ఏమిటో తేల్చకుండా, దాడిని మాత్రమే చూశారంటూ, కోర్టులో పిటిషన్ వేసి, కోడికత్తి కేసు విచారణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. బాబాయ్ వివేకాను దారుణంగా హత్యచేయించి, దాన్నికూడా జగన్ తన రాజకీయానికి వాడుకున్నాడు. కోడికత్తి ఘటనలో నిందితుడిగా పేర్కొన్న దళితుడైన శ్రీనివాస్ కుటుంబం తమబిడ్డను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని నెత్తీ నోరు బాదుకుంటోంది. జగన్ దళితుల్నే బలిచేస్తూ, తన రాజకీ య పీఠాన్ని సుస్థిరంచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ’’ అని తెలిపారు.
డాక్టర్ సుధాకర్‌ను వేధించి చంపడం మొదలు, మొన్న జరిగిన డాక్టర్ అచ్చెన్న మృతి వరకు జగన్ వ్యవహారశైలి చూస్తే, అంబేద్కర్ మహానీయుడు చెప్పినట్టుగా పులుల్ని బలి ఇవ్వరు మేకల్నే ఇస్తారు అన్నట్టు ఉందన్నారు. రాష్ట్రంలోని 40లక్షల కౌలురైతుల్లో 80శాతం మంది దళితులే ఉన్నారు. వారికి పంటలసాగుకి రుణాలు ఇప్పించడంకోసం టీడీపీ ప్రభుత్వం 2018-19లో రూ.4వేలకోట్లు కేటాయించిందన్నారు. ఆ మొత్తాన్ని జగన్ కేవలం రూ.1500కోట్లకే పరిమితం చేశారని మండిపడ్డారు. దళితుల ఆత్మగౌరవాన్ని హరిస్తూ, వారిప్రాణాలు తీస్తూ, దళిత ఆడబిడ్డల మానప్రాణాలతో జగన్, అతని ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు.
కోడికత్తి కేసు బాధితుడైన శ్రీనివాస్‌కు జగన్ ఎప్పుడు విముక్తికల్పిస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ కోర్టుకు హాజరుకాకుండా శ్రీనివాస్ బయటకురాలేడు. కోడికత్తి ఘటన జరిగిన నాడే, వైద్య సిబ్బంది జగన్‌కు అయిన గాయం చాలాచిన్నదని, ప్రమాదమేమీ లేదని తేల్చారన్నారు. కానీ జగన్ కావాలనే, ఏపీలో ఉన్న టీడీపీ ప్రభుత్వాన్ని అల్లరిచేయడానికి, హైదరాబాద్ వెళ్లి నాటకాలాడారని అన్నారు. జగన్ వ్యవహారశైలి ఏరుదాటాక తెప్పతగలేసే విధంగా ఉందన్నారు. కోడికత్తి శీను చేయని నేరానికి 4 ఏళ్లుగా సెంట్రల్ జైల్లో మగ్గిపోతున్నారన్నారు. గతఎన్నికల్లో లబ్ధిపొందడానికి కోడికత్తి ఘటనతో అమాయకుడైన శ్రీనివాస్‌ను, గొడ్డలిపోటుతో సొంత బాబాయ్ వివేకాను బలితీసుకున్న జగన్, ఈసారి ఎన్నికలకోసం ఎవర్ని బలిచేస్తున్నాడో చెప్పాలన్నారు. జగన్ తన కుయుక్తులు, కుట్రలకు ముగింపు పలకకపోతే, దళితులు ఆయనకు శాశ్వతంగా ముగింపు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ తక్షణమే కోడికత్తి కేసు శ్రీనివాస్ తల్లిదండ్రుల్ని ఆదుకోవాలి.’’ అని ఆయన డిమాండ్ చేశారు.