సామాన్య రైతు బిడ్డ స్థాయి నుండి కోట్లాది మంది అభిమానులు వెండితెర వేలుపుగా పూజించే తెలుగు సినీరంగ అగ్రశ్రేణి కథానాయకుడి స్థాయి వరకు పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమలకు మారుపేరుగా ఎదిగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు. రాముడిగా, కృష్ణుడిగా, శ్రీనివాసునిగా పలు పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ సినిమా తెరపై చేసిన మాయాజాలం ఆయన్ను అభిమానుల దృష్టిలో నడిచే దేవుడిని చేసింది
సినీ పరిశ్రమలో ఉన్నప్పటి నుంచి కూడా తెలుగువారికి ఎప్పుడు ఏ ఆపద కలిగినా... దేశానికి ఎప్పుడు ఏ అవసరం కలిగినా... సహా కళాకారులందరినీ కూడగట్టుకుని కళా ప్రదర్శనలిచ్చి, జోలె పట్టి వీధుల్లో తిరుగుతూ విరాళాలు సేకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించేవారు ఎన్టీఆర్. కళగానీ, కళాకారుడు గానీ ప్రజల కోసమే అని ఎన్టీఆర్ భావన.
నాటి దివిసీమ సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్న సమయంలోనే నిరుపేదల కన్నీళ్లు, కష్టాలు చూసి చలించిపోయారు ఎన్టీఆర్. మూడు దశాబ్దాలుగా తనను నటుడిగా ఆదరించి, వెండితెర వేలుపుగా పూజించి... విశ్వవిఖ్యాతుని చేసిన ప్రజలకు, ఏదైనా మంచి చేసి వారి ఋణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
అదే సమయంలో ఢిల్లీ పెద్దల అహంకారపు చెరలో తెలుగువారి ఆత్మగౌరవం అవమానాలు ఎదుర్కోవడం చూసి ఆ తెలుగు పౌరుషం రగిలిపోయింది. ఒక తెలుగుబిడ్డగా తెలుగువాడి తేజం ఏంటో ప్రపంచానికి చూపించాలంటే... తన రాజకీయ రంగ ప్రవేశం అనివార్యం అని భావించారు ఎన్టీఆర్.
నిబద్ధత, నిజాయితీ, నిర్భీతి, నిక్కచ్చితనం కలబోసిన ఎన్టీఆర్... తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక సాంఘిక విప్లవం తేవడానికి ఉద్దేశించిన ఉద్యమంగా మార్చారు.
ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు, పేదవాడి కడుపు నింపే రెండు రూపాయలకు కిలోబియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్, పేదవాడికి పక్కా ఇల్లు... ఇలా ఎన్నో పథకాలతో దేశంలోనే ప్రజలకు సంక్షేమ పాలనను అందించిన మొదటి పార్టీగా తెలుగుదేశం ప్రజల గుండెల్లో నిలిచింది
© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.