- కర్నూలు జిల్లా హోసూరులో వైసీపీ మూకల దారుణం
- కళ్లలో కారం చల్లి గొడ్డళ్లతో నరికి చంపేశారు
పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత వాకిటి శ్రీనివాసులు (45) దారుణహత్యకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున శ్రీనివాసులు బహిర్భూమికి వెళ్లగా దుండగులు ఆయన కళ్లలో కారం చల్లి గొడ్డళ్లతో నరికి దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ జయన్న ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి విచారణ చేపట్టారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. హత్య ఘటనకు దారితీసిన పరిస్థితులపై డీఎస్పీతో మాట్లాడారు. నిందితులను గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యేకు శ్రీనివాసులు ప్రధాన అనుచరుడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. మృతుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. వైకాపాకు చెందిన వారే హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్ని కోణాల్లో విచారణ: ఎస్పీ
పత్తికొండ మండలం హోసూరులో జరిగిన టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసులో ఇప్పటికే ఆధారాలు సేకరించామని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన.. స్థానిక పోలీసులు సహా గ్రామస్థులతో మాట్లాడారు. సాయంత్రంలోపు నిందితులను పట్టుకుంటామన్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. శ్రీనివాసులు తలపై వెనుక నుంచి గొడ్డలితో నరికినట్లు గుర్తించామన్నారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని.. నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
కేసును త్వరగా ఛేదిస్తాం: డీఎస్పీ
శ్రీనివాసులు హత్య కేసును త్వరగా ఛేదిస్తామని పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ద్వారా కేసును కొలిక్కి తెస్తామన్నారు. శ్రీనివాసులుకు గ్రామంలో ఎవరితో ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. హత్య జరిగిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో బీర్ సీసాలు గుర్తించినట్లు తెలిపారు. తల వెనుక భాగంలో మారణాయుధాలతో బలంగా దాడి చేసి చంపారని డీఎస్పీ వివరించారు.