తెలుగుదేశం పార్టీ ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో.. దేశవిదేశాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుతోంది. మహాపురుషుడు ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని.. టీడీపీ మే నెల 27,28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో మహానాడు జరగనుంది. వేమగిరి, ధవళేశ్వరం పరిధిలోని మహానాడు ప్రతినిధుల సభ వేదిక ఇప్పటికే సిద్ధమైంది. ఏసీ హాల్‌ను కూడా .. టీడీపీ నాయకులు ఇప్పటికే సిద్ధం చేశారు. వచ్చే ఏడాది 2024 ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ.. అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే మహానాడుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పసుపు తోరణాలతో రాజమహేంద్రవరం వీధులను .. పసుపుమయం చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేతలు.. ఇప్పటికే ఇక్కడ బస చేసి .. పనులను పర్యవేక్షిస్తున్నారు. గోదావరి జిల్లాలన్నీ పసుపుమయం కావాలని, ప్రతి ఇంటి నుంచి జనం తరలి రావాలని ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఎవరికి వారు పసుపు తోరణాలు,ఫెక్సీలు, జెండాలు ఏర్పాటు చేస్తున్నారు.
మహానాడులో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే రాజమహేంద్రవరానికి చంద్రబాబు, లోకేశ్ వెళ్లనున్నారు. 26న రాజమహేంద్రవరంలో చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. మహానాడు వేదికగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రాథమిక అంశాలను అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించనున్నారు. మహిళలు, రైతులు, యువతకు అధిక ప్రయోజనం చేకూర్చేలా తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టో ఉండనుంది. దసరా నాటికి పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ .. ఈ సారి మరింత ప్రతిష్టాతక్మంగా మహానాడును నిర్వహిస్తున్నారు. దాదాపు ఈ మహానాడులో.. మొత్తం 25 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.
మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలు, ఏర్పాట్ల మీద పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరగనుంది. 27న మహానాడు తొలిరోజు ప్రతినిధుల సభలో 15 తీర్మానాలపై చర్చ జరగనుంది. 15 వేల మంది ప్రతినిధులు పాల్గొనేలా.. పెద్ద వేదికను ఏర్పాటు చేశారు. వేదికపై చంద్రబాబుతో పాటు పొలిట్‌బ్యూరోసభ్యులు, పార్టీ ముఖ్యనేతలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్లమెంటరీ ఇన్‌చార్జిలు ఆశీనులవుతారు. వేదిక మీద సుమారు 300 మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఒక్కో తీర్మానంపై కనీసం ఇద్దరు చొప్పున సుమారు 50 మంది వరకూ మాట్లాడే అవకాశం ఉంది. ఏపీకి సంబంధించిన 15, తెలంగాణకు సంబంధించిన 6 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. 4 ఉమ్మడి తీర్మానాలు ఉండొచ్చని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ నెల 27న ప్రతినిధుల సభలో తీర్మానాలు ప్రవేశపెడతారు. 28న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా భారీ బహిరంగ సభ ఉంటుంది. ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మొత్తం కలిపి.. మహానాడుకు 15 లక్షల మంది సభకు హాజరవుతారని టీడీపీ భావిస్తోంది.