వినియోగదారులపై రూ. 57,188 కోట్ల భారం
విద్యుత్ కృత్రిమ కొరత సృష్టించి అధికధరకు కొనుగోళ్ళు
ఒక్కో యూనిట్ కు అదనంగా రూ.4.02 చెల్లింపు
మోటార్లకు మీటర్లు రైతులకు ఉరితాళ్లే
విద్యుత్ పై మహానాడులో టిడిపి తీర్మానం
……
సామాన్య ప్రజానీకంపై విద్యుత్ భారం భరించరానిదిగా తయారైంది. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, అవినీతి కారణమా విద్యుత్ వినియోగదారులపై రూ. 57,188 కోట్ల భారం పడింది. విద్యుత్ పంపిణీని క్రమబద్ధీకరించకుండా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి, కమిషన్ లు దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. స్మార్ట్ మీటర్ల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ చేసేందుకు మార్గం ఏర్పరచారు. రూ. 18 వేల విలువ చేసే స్మార్ట్ మీటర్ ను రూ. 30 వేలకు కొనుగోలు చేయటం ద్వారా కమిషన్ ల రూపంలో దాదాపు రూ.12 వేల కోట్లు ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లోకి
చేరుతోంది. ఆ భారమంతా వినియోగదారులపై పడుతోంది. వీటికి తోడు టారిఫ్ ల కుదింపు, శ్లాబుల మార్పు, అదనపు డిపాజిట్ ల రూపంలో 7 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు. విద్యుత్ చార్జీల పెంపు కారణంగా వినియోగదారులపై రూ. 17,093 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. పవర్ ఫీనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు రూ. 36,261 కోట్లు, హిందుజా సంస్థకు చెల్లించేందుకు తెచ్చిన అప్పు రూ. 2,883 కోట్లు భారాన్ని సైతం వినియోగదారులే భరించాల్సి వుంది.
2014 లో 22.5 మిలియన్ యూనిట్ ల లోటు తో వున్న విద్యుత్ రంగం, నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన చర్యల ఫలితంగా 10 వేల మెగా వాట్ ల అదనపు విద్యుత్ సామర్ధ్యం పెరిగి, ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే నాటికి మిగులు విద్యుత్ వుంది. విద్యుత్ కోతలు లేకుండా, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ఇతర రాష్ట్రాలకు విద్యుత్ విక్రయించే స్థాయికి విద్యుత్ రంగం చేరుకుంది. అయితే ఈ నాలుగేళ్లలో అదనంగా ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెరగకపోవటం దారుణం. విద్యుత్ కోతలు పెరగటంతో పాటు, పరిశ్రమలకు సైతం పవర్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్తితి ఉత్పన్నమైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీపీఏ లను రద్దు చేయటం విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. 20199 నుంచి 2022 మద్య కాలంలో బయట మార్కెట్ లో రూ. 12,200 కోట్ల మేర విద్యుత్ కొనుగోలు చేసినట్టు ఆర్టీఐ సమాహారం ద్వారా వెల్లడైంది. అంటే యూనిట్ కొనుగోలు రేటు సగటున రూ.8.77 గా వుంది. ఒక్కో యూనిట్ కు అదనంగా రూ.4.02 పైసలు చెల్లించినట్టు ఆరోపణలున్నాయి. కొంతమంది కమిషన్ ల కోసమే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి.
ఈ పరిణామాల నేపధ్యంలోనే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించటం రైతుల మెడకు ఉరితాళ్ళు వేయటమే నన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాజమహేంద్రవరం వేదికగా జరిగిన మహానాడులో దీనిపై టిడిపి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి, ఒప్పందాలపై విచారణకు ఆదేశిస్తామని వెల్లడించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మహానాడులో డిమాండ్ చేస్తూ ఈ మేరకు తీర్మానం ఆమోదించారు.