- ఎన్నికల ఖర్చు తగ్గే అవకాశం
- వికసిత్ భారత్‌లో భాగస్వామ్యమే లక్ష్యం
- లోక్‌సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని
ఢిల్లీ (చైతన్యరథం): వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్త్తోందని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లుపై ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ `2047 లక్ష్యసాధన కార్యక్రమాలకు టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. దేశ సమాఖ్య స్ఫూర్తి, పురోగతి, అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు వికసిత్ భారత్ లక్ష్యానికి వికసిత్ ఆంధ్ర `2047 ను అనుసంధానం చేయాలని ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
అనేక ప్రయోజనాలు
వన్ నేషన్ `వన్ ఎలక్షన్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని కేంద్రమంత్రి పెమ్మసాని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు సుమారు రూ.6 వేల కోట్లు, 2024 లో రూ.10 వేల కోట్లపైగా ఎన్నికల కమిషన్ ఖర్చు చేసినట్లు వివరించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. రెండిరటినీ ఒకేసారి నిర్వహిస్తే ఖర్చులు 40 శాతం తగ్గే అవకాశం ఉందని, దీంతోపాటు ఏడు శాతం వరకు ఓటింగ్ పెరుగుతుందని తెలిపారు.
ఖర్చులు – విధులు
దేశంలో రాజకీయ పార్టీలకు లక్ష కోట్ల రూపాయలకు పైగా ఎన్నికల ఖర్చు అవుతుందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఈ ఖర్చు కూడా తగ్గుతుందని వివరించారు. గత ఆరు నెలల్లో రాష్ట్ర స్థాయిల్లో మూడు ఎన్నికలు జరిగాయని, ఈ కారణంగా అధికార యంత్రాంగం రెగ్యులర్ విధులకు ఆటంకం కలుగుతుందని వివరించారు. విడతల వారీగా ఎన్నికలను నిర్వహించడం ద్వారా ఆ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందని పెమ్మసాని తెలిపారు.