- పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ చైర్మన్గా, ఏడుగురు సభ్యులతో ఏర్పాటు
- పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలనే విషయంపై అధ్యయనం
- 9 అంశాలను పరిశీలించనున్న కమిటీ
- నివేదికకు నెల రోజుల సమయం
అమరావతి(చైతన్యరథం): రాజధాని అమరావతి నిలిచిపోయిన నిర్మాణాల స్థితిగతులపై అధ్యయనానికి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేశారు. గతంలో నిలిచిపోయిన పనులను పరిశీలించి, వాటిని ఎక్కడినుంచి తిరిగి ప్రారంభించాలనే విషయంలో ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. అమరావతి రాజధాని నగరంలో ఉన్న సమస్యలను గుర్తించి తగు సూచనలు చేయనుంది. పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ ఛైర్మన్గా మొత్తం ఏడుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా ఆర్ అండ్ బీ, వీఎంసీ, ఏపీసీపీడీసీఎల్, ఏప ీసీఆర్డీఏ, ఏడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రతినిధి ఉంటారు. మొత్తం 9 అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. నెలరోజుల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని నిర్మాణంలో పనుల ప్రస్తుత పరిస్థితిని సాంకేతిక కమిటీ అధ్యయనం చేయనుంది. 2019 మే నుంచి నిలిచిపోయిన వివిధ భవనాల పటిష్టతను కమిటీ అంచనా వేయనుంది. దీనికోసం గుర్తింపు పొందిన సంస్థలు, నిపుణుల సలహాలు తీసుకోనుంది.
రోడ్లకు, డ్రైనేజీ, నీటి సరఫరా కోసం వేసిన పైప్ లైన్లకు, విద్యుత్, కమ్యూనికేషన్ పనులకు జరిగిన నష్టాన్ని కమిటీ అంచనా వేయనుంది. రాజధాని లోని పలు ప్రాంతాల్లో మిగిలి ఉన్న మెటీరియల్ నాణ్యతలను పరిశీలిస్తుంది. పైప్ లు, ఇనుము, ఇతర మెటీరియల్ మన్నికను అంచనా వేయనుంది. నిలిచిపోయిన పనులపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై సిఫార్సులు చేయటంతో పాటు, నిలిచిపోయిన పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై నిర్దిష్టమైన సూచనలు చేస్తుంది. వివిధ కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చే క్లెయిమ్ లను అధ్యయనం చేసి తదనుగుణండా సిఫార్సులు చేయనుంది. ఈ మేరకు కమిటీ ఏర్పాటుపై మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.