- శాంతిభద్రతల పరిరక్షణలో రాజీవద్దు
- చిన్నారులు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం
- ప్రతి 3 నెలలకోసారి శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్ష
- పటిష్ట భద్రతతో శాసనసభ సమావేశాల నిర్వహణ అభినందనీయం
- కలెక్టర్ల సదస్సును కూడా సమర్థవంతంగా నిర్వహిద్దాం
- ‘హెల్మెట్’ ధరించని వారిపట్ల సున్నితంగా వ్యవహరించాలి
- డీజీపీ కార్యాలయంలో సమీక్షలో హోంమంత్రి అనిత
అమరావతి (చైతన్యరథం): నేరాల నియంత్రణలో టెక్నాలజీ పాత్ర చాలా కీలకమని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో రాజీపడవద్దని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. చిన్నారులు, మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. నేరం జరగ్గానే నిందితులను పట్టుకోవడం మంచి పరిణామమని పోలీసు యంత్రాంగం పనితీరును మెచ్చుకున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల వంటి టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటే నేరాలను మరింత తగ్గించవచ్చన్నారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో హోంమంత్రి అనిత శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి 3 నెలలకోసారి శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పటిష్ట భద్రతతో శాసనసభ సమావేశాల నిర్వహణకు కృషి చేసిన పోలీసులందరినీ హోంమంత్రి అభినందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈ నెల 25,26 తేదీల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సుకు కూడా సమర్థవంతంగా భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.
కెమెరాల ఏర్పాటులో పురోగతిపై జిల్లాల ఎస్పీలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో ఇప్పటికే సుమారు 24వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ తెలిపారు. జిల్లాల వారీగా డీజీపీ హరీష్ గుప్తా ఇచ్చిన లక్ష్యాలను చేరుకునే దిశగా కృషి చేస్తున్నట్లు హోంమంత్రికి ఎస్పీలు వివరించారు. ‘హెల్మెట్’ ధరించని వారిపట్ల సున్నితంగా ముందుకెళ్లాలని నగర కమిషనర్లకు హోంమంత్రి దిశానిర్దేశం చేశారు. అవసరమైనచోట కఠినంగా ఉంటూనే కొన్నిచోట్ల పట్టువిడుపుతో వ్యవహరించాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా పోలీసులు నిర్వహిస్తున్న హెల్మెట్ డ్రైవ్‌ను హోంమంత్రి ప్రశంసించారు. రెవెన్యూపరమైన కేసులను మరింత వేగంగా పరిష్కరించేందుకు పోలీస్ శాఖ బాధ్యత నిర్వహించాలన్నారు. అందుకోసం రెవెన్యూ శాఖతో నిరంతరం పోలీస్ శాఖ సమన్వయం చేసుకోవాలన్నారు. న్యాయపరమైన చిక్కుముడులున్న కేసులపైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం, పబ్లిక్ న్యూసెన్స్ కేసులపైనా హోంమంత్రి ఆరా తీశారు. వాటిని నియంత్రించేందుకు పాత రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని హోంమంత్రి ఆదేశించారు. కాగా హోంమంత్రి అనితను రాష్ట్ర పోలీస్ సంఘం ప్రతినిధులు కలిశారు. పోలీసులకు రావలసిన సరెండర్ లీవుల బకాయిలు ఇప్పించాలని కోరుతూ వారు వినతిపత్రం అందజేశారు.
సమీక్షకు డీజీపీ హరీష్ గుప్తాతో పాటు ఐజీ,డీఐజీ స్థాయి పోలీస్ ఉన్నతాధికారులు, విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్లు, అన్ని జిల్లాల ఎస్పీలు, డీజీపీ కార్యాలయంలోని పోలీస్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
సమీక్ష సమావేశం ముగించుకుని క్యాంపు కార్యాలయానికి బయలుదేరిన హోంమంత్రి అనితని కొంతమంది హిజ్రాలు కలిశారు. ఇటీవల అనకాపల్లి హిజ్రా హత్య కేసులో ప్రభుత్వం, పోలీసుల స్పందనను మెచ్చుకుంటూ వారు ప్రత్యేకంగా హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఓ హిజ్రాకు సంబంధించిన పోస్టింగ్ గురించి హోంమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఎన్జీవో, వన్ స్టాప్ సెంటర్లలో గతంలో ఉద్యోగాలుండేవని ప్రస్తావించారు. చదువుకున్న అర్హతలను బట్టి గౌరవప్రదంగా ఉద్యోగం చేసి బతకాలనుకునే హిజ్రాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని హోంమంత్రిని కోరారు.