- ఎస్సీ వర్గీకరణపై దళిత ఎమ్మెల్యేలతో సీఎం భేటీ
- అనుసరించాల్సిన ప్రణాళికపై విస్తృత చర్చ
- జనాభా దామాషాలో జిల్లా ఒక యూనిట్‌గా అమలు
- వర్గీకరణతో ఉప కులాలకు సమాన అవకాశాలు
- విద్యా, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత
- వ్యాపార అవకాశాలు కల్పించడం ద్వారా ఊతం
- కార్యాచరణ అమలుకు సన్నద్ధమవుదాం..
- ఆదినుంచీ దళితులకు అండగా నిలిచింది తెదేపా
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ
అమరావతి (చైతన్య రథం): దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కూటమి పార్టీల దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చర్చించారు. వర్గీకరణ అమలు ద్వారా దళితుల్లోని ఉప కులాలందరికీ దామాషా ప్రకారం సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతమిచ్చేలా పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పుతో పాటు… ఎన్నికల హామీ కూడా ఉన్నందున కార్యాచరణపై ఎమ్మెల్యేలతో సీఎం చర్చించారు. జనాభా దామాషా పద్ధతిలో జిల్లా ఒక యూనిట్‌గా వర్గీకరణ అమలు చేస్తామన్నారు. సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు వర్గీకరణ అమలు చేశామని… తరువాత న్యాయ సమస్య కారణంగా కార్యక్రమం నిలిచిపోయిందని సీఎం గుర్తు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు వర్గీకరణను అమలు చేయడానికి సిద్ధమయ్యాయని… ఎవరికీ అన్యాయం జరగకుండా జిల్లా ఒక యూనిట్‌గా వర్గీకరణ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సీఎం తెలిపారు. తెలుగుదేశం పార్టీ దళితులకు మొదటినుంచీ అండగా ఉందంటూ.. జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా అంటరానితనంవంటి సామాజిక రుగ్మతలను రూపుమాపామని సీఎం గుర్తు చేశారు. 2014 తరువాత జీవో నెంబర్ 25 ద్వారా దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చుపెట్టామన్నారు.
ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణపై స్పష్టత వచ్చింది కాబట్టి దీనికి అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వివరించారు. వర్గీకరణ అమలుపై కమిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనితోపాటు దళిత వర్గాన్ని పైకి తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాల్సి ఉందని సీఎం అన్నారు. విద్యా, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధితోపాటు వ్యాపార అవకాశాలు కల్పించడం ద్వారా దళిత జాతి సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం అన్నారు. 2014లో బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్‌తో పాటు అనేక కార్యక్రమాలు అమలు చేసిన విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. చంద్రన్న బాట పేరుతో ప్రతి దళితవాడలో నాడు సిమెంట్ రోడ్లు వేశారని ఎమ్మెల్యేలు గుర్తుచేశారు. గత ఐదేళ్లలో దళిత వాడల్లో ఒక్క రోడ్డు కూడా వెయ్యలేదని… ఒక్క టాయిలెట్ కట్టలేదని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. దళిత కుటుంబాల్లో పెద్దఎత్తున మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన విషయాన్ని ఎమ్మెల్యేలు ప్రస్తావించారు.
గత ఐదేళ్లలో దళిత జాతి తీవ్ర అణచివేతకు, వివక్షకు గురైందని… గత ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలతో తమ వర్గ ప్రజల జీవన ప్రమాణాలు తీవ్రంగా పడిపోయాయని ఎమ్మెల్యేలు సీఎంకు వివరించారు. అవన్నీ దళిత జాతి ప్రజలు గుర్తు పెట్టుకున్నారని…. అందుకే 2019లో జరిగిన తప్పును సరిదిద్దుకుని రెండు తప్ప అన్ని దళిత నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్ధులను గెలిపించారని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. నేడు గ్రామాల్లో దళితులు కౌలు రైతులుగా సాగు చేస్తున్నారని.. వారికి ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యేలు కోరారు. వచ్చే ఐదేళ్లలో దళిత వర్గాన్ని నిలబెట్టేందుకు ఏం చేయాలి… వారి సమగ్ర అభివృద్ధికి ఎటువంటి విధానాలు అమలు చేయాలనే విషయంపై ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు వివరించారు. ‘మీరంతా స్వశక్తితో ఎదిగి ఇక్కడి వరకు వచ్చారు. నేడు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు. మీకు వచ్చిన అవకాశాల ద్వారా దళిత ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’ అని సీఎం ఉద్బోధించారు. మొన్నటి ఎన్నికల్లో 29 ఎస్సీ సీట్లకుగాను 27 నియోజకవర్గాల్లో ప్రజలు గెలిపించారని… వారి నమ్మకాన్ని నిజం చేస్తామని సీఎం అన్నారు. మళ్లీ మీ అందరినీ 2029లో ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటానని సీఎం అన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉంటారా? కంటిన్యూగా ఎమ్మెల్యేగా ఉంటారా? అనే విషయం మీ చేతిల్లో కూడా ఉంటుందంటూ సీఎం నవ్వుతూ వ్యాఖ్యానించారు. గెలిపించిన ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించారు.