అమరావతి (చైతన్య రథం): విజయవాడలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతి చెందడం దురదృష్టకర ఘటనగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తూ.. గాయపడినవారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలందిస్తుందన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరినట్టు అధికారులు తెలిపారని అంటూ.. ప్రకృతి విపత్కర సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించే ఏర్పాటు చేసిందన్నారు. అధికారులు లోతట్టు ప్రాంతాలవారిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారని, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో అధికారులకు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, శ్రేణులు సాయంగా ఉండాలన్నారు. ఆహారం, రక్షిత తాగునీరు, వైద్య సాయం అందించడంలో తోడ్పాటు అందించాలన్నారు.