- భద్రత తగ్గించారని గగ్గోలు
- కండిషన్‌లో లేని కారు ఇచ్చారని పెడబొబ్బలు
- వాస్తవానికి జడ్ ప్లస్ భద్రత కల్పించారు
- మంచి ఫిట్‌నెస్‌తో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు
అమరావతి: జగన్ అంటే ఫేక్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్. తన పార్టీ పుట్టుక నుంచి..నేటి పతనం వరకు ఆయన ఫేక్ రాజకీయాలనే నమ్ముకున్నాడు. జగన్ మాట, నడక, నవ్వు, నమస్కారం కూడా ఫేక్ అని ఆయనను గమనించి వాళ్లు ఎవరైనా చెప్పగలరు. తనకు మాత్రమే ఉన్న ఫేక్ పాలిటిక్స్ పేటెంట్‌తో మరో సారి తన, తన పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశాడు. శవ రాజకీయం కోసం శుక్రవారం వినుకొండ బయలుదేరిన ఆయన పది నిమిషాలకే తనకు కండిషన్‌లో లేని కారు కేటాయించారంటూ వాహనం దిగిపోయి సొంత కారులోకి మారిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత తగ్గించిందంటూ పెడబొబ్బలు పెట్టారు. సౌకర్యంగా లేదంటూ వాహనం మార్చుకున్న ఆయన, విషయాన్ని పక్కదారి పట్టించేలా కారు కండిషన్‌పై ఆరోపణలు చేశారు.
కండిషన్‌లో లేని వాహనాలు ఇచ్చారని, భద్రత తగ్గించారని మాజీ సీఎం జగన్, ఆయన పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. జగన్‌కు ప్రస్తుతం జడ్‌ప్లస్ సెక్యూరిటీకి ఇచ్చే భద్రత ఉందని పోలీసుశాఖ నిర్ధారించింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఫిట్‌నెస్‌పై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. జగన్‌కు కేటాయించిన వాహనం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని, కండిషన్ చూసిన తర్వాతే కేటాయించామని అధికారులు స్పష్టం చేశారు. సౌకర్యంగా లేదని జగన్ కారు దిగి… వాహనం ఫిట్‌గా లేదని ప్రచారం చేయడం తగదన్నారు. జగన్ కారు దిగిన తర్వాత అదే కాన్వాయ్‌లో ఆ వాహనం వెళ్లిందని, ఎలాంటి ఇబ్బంది రాలేదని వివరించింది.
మొదట జగన్ కార్యాలయ సిబ్బంది ఐఎస్‌డబ్ల్యూ అధికారులను సంప్రదించి, బుల్లెట్ ప్రూఫ్ టాటా సఫారీ కారు బదులుగా బుల్లెట్ ప్రూఫ్ టయోటా ఫార్చూనర్, ప్రడో కారు కోసం అభ్యర్థించారు. మరో ప్రత్యామ్నాయం లేనందున, జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుండి అదే టాటా సఫారీ బుల్లెట్ ప్రూఫ్ కారులో ఉదయం 10:05 గంటలకి బయలుదేరారు. ప్రయాణం మొదలెట్టిన 10 నిమిషాలకే, సౌకర్యంగా లేదంటూ జగన్ తన స్వంత టయోటా ఫార్చూనర్ కారులోకి మారారు. అయితే కారు మంచి కండీషన్లోనే వున్నది, ఎలాంటి బ్రేక్‌డౌన్ అవ్వలేదు. మాజీ ముఖ్యమంత్రికి ల్యాండ్ క్రూజర్ ప్రడో బుల్లెట్ ప్రూఫ్ కారు అలవాటై వుండటం వలన, సఫారీ కారులో ప్రయాణించడం ఆయనకు కొంచెం అసౌకర్యం అనిపించి వుండవచ్చు. కారు మార్చడానికి ఇదే కారణం. కారు బ్రేక్ డౌన్ అయింది అనే ఆరోపణ అబద్ధం అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
శవ రాజకీయానికి వినుకొండ బయలుదేరిన జగన్ కొద్ది నిమిషాలు కూడా తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చోలేకపోయాడు. ఎన్‌ఎస్‌జీ భద్రతలో జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా ఇదే తరహా సఫారీ కారులో కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించారు. కానీ ఎక్కడా తనకు కంఫర్ట్‌గా లేదు అనలేదు. నా వాహనాలు మార్చండి అని యాగీ చెయ్యలేదు. ప్రభుత్వం కక్ష కట్టింది అని రాజకీయం చేయలేదు. అప్పటికే మూడు సార్లు సీఎంగా చేసిన ఆయన ఆ వయసులో అదే తరహా వాహనంలో ప్రయాణం చేశారు. ప్రజల పక్షాన పోరాడారు. ఇంతెందుకు నంద్యాలలో అక్రమంగా అరెస్టు చేసి రోడ్డు మార్గంలో తీసుకువచ్చింది కూడా అదే తరహా సఫారీ కారులో. కానీ జగన్ మాజీ అయిన నెల రోజులకే ప్రభుత్వ కారు నచ్చలేదు. సౌకర్యవంతంగా లేదు అని దిగిపోయాడు. అంతే తప్ప ఆ కారులో ఏ సమస్యా లేదు. జగన్ దిగిన తరువాత కూడా ఆ కారు ఆ కాన్వాయ్‌ను అనుసరిస్తూ ఎలాంటి సమస్య లేకుండా వెళ్లింది. వాస్తవం ఇలాఉంటే కండిషన్‌లో లేని కారు ఇచ్చారంటూ జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.